Begin typing your search above and press return to search.

లంచాల్లో మనమే టాప్​! సర్వే తేల్చిన వాస్తవం

By:  Tupaki Desk   |   27 Nov 2020 12:30 AM GMT
లంచాల్లో మనమే టాప్​! సర్వే తేల్చిన వాస్తవం
X
లంచం అనే సమస్య దశాబ్ధాలుగా మనదేశాన్ని పట్టిపీడిస్తున్నది. ప్రధానంగా కొన్ని ప్రభుత్వ విభాగాల్లో ఈ లంచం అనే జబ్బు ఓ మహమ్మారిలో వ్యాపించింది. లంచం తీసుకొని పనిచేయడం అనేది మనదేశంలో ఓ సాధారణ విషయంగా పరిణమించింది. ఎవరైనా ఓ ఉద్యోగి లంచం తీసుకోకపోతేనే అతడి గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ట్రాన్స్​పరెన్సీ ఇంటర్నేషనల్​ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం మరోసారి రుజువయ్యింది. దేశవ్యాప్తంగా ఈ సంస్థ సర్వే నిర్వహించగా సర్వేల్లో పాల్గొన్న 47 శాతం మంది అవినీతి గడిచిన 12 నెలలుగా పెరిగిందని చెప్పారట. మరో 63 శాతం మంది ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి జరిగిన విషయాన్ని ఒప్పుకుంటూనే ప్రభుత్వం కూడా అవినీతిని అరికట్టేందుకు చర్యలు తీసుకున్నదని చెప్పారట.

అయితే ఆసియా ఖండంలోనే అత్యధికంగా భారత్​లోనే అవినీతి ఎక్కువగా ఉన్నదని ఈ సంస్థ తేల్చిచెప్పింది. అయితే మనదేశంలో 39 శాతం పనులు కేవలం లంచంతోనే జరుగుతున్నట్టు ఈ సర్వే సంస్థ తేల్చిచెప్పింది.

పోలీస్ శాఖ , కోర్టులు, ప్రభుత్వ ఆస్పత్రులు, రెవెన్యూ సేవలు, ధ్రువీకరణ పత్రాల జారీ తదితర అంశాలపై సర్వే నిర్వహించారు. అత్యధికంగా పోలీసులు, ధ్రువీకరణ పత్రాల జారీకి ఎక్కువగా లంచాలు తీసుకున్నట్టు సర్వే తేల్చిచెప్పింది. అయితే మనదేశంలో లంచాలతోపాటు వ్యక్తిగత పరిచయాల వల్ల కూడా పనులు జరుగుతున్నట్టు సర్వేలో తేలింది.

పోలీస్​శాఖలో 39 శాతం మంది వ్యక్తిగత పరిచయాల వల్ల పనులు చేసుకుంటున్నారట. అలాగే ధ్రువపత్రాల జారీకి 42 శాతం మంది వ్యక్తిగత పరిచయాల మీద ఆధారపడుతున్నారట. కోర్టు వ్యవహారాల్లో 38 శాతం మంది పరిచయాలనే వాడుకుంటున్నారట. అయితే చాలా పనులు ఆన్​లైన్​ చేయడం వల్ల కొంతమేర అవినీతి తగ్గిందని నివేదికలో పేర్కొన్నారు. మనదేశంతో పాటు నేపాల్, థాయ్‌లాండ్‌లో అవినీతి పెరిగింది. చైనాలోని అవినీతి కొంతమేర తగ్గింది. లంచాల్లో భారత్ 39 శాతంతో తొలిస్థానంలో ఉండగా.. తర్వాత కాంబోడియా , ఇండోనేషియా ఉన్నాయి. మాల్దీవులు, జపాన్​ లాంటి దేశాల్లో అవినీతి చాలా వరకు తగ్గింది.