Begin typing your search above and press return to search.

కరోనావైరస్ తో ఆర్థిక సంక్షోభంలో భారత్

By:  Tupaki Desk   |   28 Nov 2020 12:30 AM GMT
కరోనావైరస్ తో ఆర్థిక సంక్షోభంలో భారత్
X
భారతదేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను కరోనా దెబ్బతీసింది. ఇప్పట్లో దేశం కోలుకోవడం కష్టమే అంటున్నాయి అంతర్జాతీయ సంస్థలు. రెండో త్రైమాసికంలో (జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో) దేశ స్థూల జాతీయోత్పత్తి 7.5 శాతం కుచించుకుపోయిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

గడిచిన ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీ 35.84 లక్షల కోట్లుగా ఉంటే.. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అది 33.14 లక్షల కోట్లకు తగ్గినట్లు కేంద్ర గణాంకశాఖ శుక్రవారం వెల్లడించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం జీడీపీ 4.4 శాతం వృద్ధి నమోదు కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీ 7.5 శాతం తగ్గిపోయింది.

2020-21 మొదటి త్రైమాసికంతో పోలిస్తే పరిస్థితి కొంత మెరుగుపడినట్లు తెలుస్తోంది. రెండు నెలల లాక్‌డౌన్ భారత ఆర్థిక వ్యవస్థను గణనీయంగా దెబ్బతీసింది. ఏప్రిల్-జూన్ సమయంలో ఆర్థిక వ్యవస్థ 24 శాతం సంకోచించింది.

గడిచిన 40 ఏళ్లల్లో భారతదేశం ఇంత ఆర్థిక పతనాన్ని చూడలేదు. జీ20 దేశాల్లో అథమ స్థాయిలో ఉన్న దేశం కూడా ఇదే. మార్చి నుంచి మే నెల వరకూ కొనసాగిన రెండు నెలల లాక్‌డౌన్ తరువాత ఆర్థిక పరిస్థితి ఎంతవరకూ పుంజుకున్నదనే విషయం తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది.

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో అతిపెద్ద సంక్షోబాన్ని ఎదుర్కొంటున్నాయి. భారత ఆర్థిక వృద్ధి సూచనను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మరింత తగ్గించింది. మార్చి 2021 వరకు ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి ( జీడీపీ) 10.3 శాతం తగ్గిపోతుందని ఐఎంఎఫ్ పేర్కొంది. జూన్‌లో అంచనా వేసిన 4.5% క్షీణత కంటే ఇది చాలా ఘోరంగా ఉంది. 5.8 శాతం పాయింట్ల పతనంలో ఇది ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో అతిపెద్దది.

వృద్ధి రేటుపై చైనా కీలక ప్రకటన చేసింది. కరోనా మొదట చైనాలో బయటపడినప్పటికి కొద్ది రోజుల్లోనే అదుపు చేయగలిగిందని నివేదిక తెలిపింది. చైనాలో ఇప్పుడు వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఉందని, రికవరీ బలపడుతోందని తెలిపింది. ఈ సంవత్సరం చైనా వృద్ధి రేటు 1.9% ఉంటుందని అంచనా వేసింది. జూన్లో 1% అంచనా వేసినప్పటికీ “చైనాలో పరిశ్రమలు, కార్యాలయాలు తిరిగి యథాస్థితిలోకి రావడంతో వృద్ధికి రేటు ఊహించిన దానికంటే బలంగా ఉందిని ఐఎంఎఫ్ తెలిపింది.

చైనాను మినహాయించి అభివృద్ధి చెందుతున్న మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు, అవకాశాలు మసకబారుతూనే ఉన్నాయని ఐఎంఎఫ్ ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్న నేపథ్యంలో భారతదేశంలో అత్యవసరంగా మరిన్ని విధానపరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఐఎంఎఫ్ సూచించింది. కోవిడ్19 మహమ్మారితో నష్టం పెద్దది కావడానికి ముందే అప్రమత్తమవ్వాలని తెలిపింది. కరోనా వైరస్ ముప్పును నివారించేందుకు ప్రభుత్వం తగిన సమయంలో చర్యలు తీసుకోవాల్సి ఉందని పేర్కొంది.