Begin typing your search above and press return to search.

రెచ్చిపోవటంలో మనోళ్లే ఎక్కువంట

By:  Tupaki Desk   |   17 March 2015 6:05 AM GMT
రెచ్చిపోవటంలో మనోళ్లే ఎక్కువంట
X
వెనుకాముందు చూసుకోకుండా మాట్లాడేయటం రాజకీయ నాయకులకే కాదు.. భారతదేశ ప్రజలకు అలవాటేనని తాజాగా తేలింది. మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు విద్వేషాన్ని రగిలించే ప్రసంగాలు.. అసభ్యమైన ఫోటోలు ఇలా తమకు నచ్చినట్లుగా వ్యవహరించే ధోరణి భారత ప్రజలకు ఎక్కువని తేల్చారు.

ప్రముఖ సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ తాజాగా వెల్లడించిన గణాంకాలు చూసినప్పుడు భారతదేశంలో స్వేచ్ఛ చాటున ఇష్టారాజ్యంగా అభిప్రాయాల్ని వ్యక్తం చేసే ధోరణి ఎక్కువన్న అనుమానం కలగక మానదు. పరమత సహనానికి నిలువెత్తు రూపంగా ఉండే భారత్‌లో.. అందుకు భిన్నమైన ధోరణి కనిపించటం ఆందోళన కలిగించేదే.

విద్వేషపూరితంగా చేసిన వ్యాఖ్యలను తొలగించాలని కోరుతూ భారీగా వినతులు భారతదేశ ప్రభుత్వం నుంచి వచ్చినట్లు ఫేస్‌బుక్‌ పేర్కొంటోంది. మిగిలిన దేశాలతో పోలిస్తే.. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన అంశాల్ని తొలగించాలని కోరుతూ వచ్చే వినతులు ఎక్కువని తేల్చారు.

గత ఆర్నెల్ల వ్యవధిలో.. పోస్టింగులను తొలగించాలని కోరుతూ మొత్తం ప్రపంచ దేశాల్లో భారత్‌ నుంచే అత్యధిక వినతులు వచ్చినట్లు చెబుతున్నారు. 5,832 అభ్యంతరాలు భారత్‌ నుంచి రాగా.. తర్వాతి స్థానంలో టర్కీ నిలిచింది. ఈ దేశం నుంచి 3624 వినతులు.. జర్మనీ 60.. రష్యా 55.. పాకిస్థాన్‌ నుంచి 54 వచ్చాయని చెబుతున్నారు.

పోస్టింగులు తొలగించాలని కోరుతూ వచ్చిన అభ్యర్థనలలో న్యాయాన్ని చూశాక మాత్రమే.. వాటిని తొలగిస్తున్నట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది. అభ్యంతర అంశాలతో పాటు.. వ్యక్తిగత వివరాల్ని కూడా భారత్‌ భారీగానే తెలుసుకొంటోంది.

వ్యక్తిగత వివరాల సేకరణ విషయానికి వస్తే.. దోపిడీ దొంగలు.. అపహరణ ముఠాలకు సంబంధించిన వారి సమాచారం ఉంటుందని చెబుతున్నారు. గత ఆర్నెల్లలో ఇలాంటి వాటికి సంబంధించి 7281 మంది వివరాలు అడిగితే.. వాటిలో 44.7శాతం వివరాల్ని తాము అందించినట్లుగా ఫేస్‌బుక్‌ చెబుతోంది.