Begin typing your search above and press return to search.

అప్పుడు మోడీ వద్దన్నారు.. ఇప్పుడు వాళ్లు లేవ‌న్నారు!

By:  Tupaki Desk   |   26 May 2021 9:33 AM GMT
అప్పుడు మోడీ వద్దన్నారు.. ఇప్పుడు వాళ్లు లేవ‌న్నారు!
X
దేశాన్ని వ్యాక్సిన్ కొర‌త వేధిస్తోంది. ఇప్పుడు దేశంలో రెండే సంస్థ‌లు వ్యాక్సిన్ ఉత్ప‌త్తి చేస్తున్నాయి. భార‌త్ భ‌యోటెక్ కొవాగ్జిన్ టీకాను త‌యారు చేస్తుండ‌గా.. సీరం ఇనిస్టిట్యూట్ కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్ప‌త్తి చేస్తోంది. అయితే.. దేశంలో డిమాండ్ కొండంత ఉండ‌గా.. ఈ రెండు సంస్థ‌ల ఉత్ప‌త్తి గోరంత ఉంది. దీంతో.. అనివార్యంగా విదేశీ వ్యాక్సిన్ల‌ను ఆహ్వానించాల్సి వ‌చ్చింది.

ఈ క్ర‌మంలో విదేశాంగ‌శాఖ మంత్రి జైశంక‌ర్ ఫైజ‌ర్, మోడెర్నా టీకా ప్ర‌తినిధుల‌ను లైన్లోకి తీసుకున్నారు. దేశంలోని ప‌రిస్థితిని వారికి వివ‌రించారు. ప్ర‌పంచంలోనే ఏ దేశంలో జ‌ర‌గ‌నంత ప్రాణ‌న‌ష్టం జ‌రిగింద‌ని, వెంట‌నే టీకాల‌ను ఎగుమ‌తి చేయాల‌ని కోరారు. దీనికి ఆయా సంస్థ‌లు ఊహించ‌ని స‌మాధానం చెప్పిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రో రెండేళ్ల వ‌ర‌కు వ్యాక్సిన్ అందించే అవ‌కాశం లేద‌ని చెప్పాయ‌ట‌!

వ్యాక్సిన్ల ఉత్ప‌త్తి మొద‌లైన తొలినాళ్ల‌లో ఫైజ‌ర్, మోడెర్నా టీకాల‌ను భార‌త్ లోకి అనుమ‌తించాల‌ని ఆ సంస్థ‌లు కోరాయి. కానీ.. అప్ప‌టికి మూడు ద‌శ‌ల‌ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ పూర్తికాలేదు. దీంతో.. కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు. దీంతో.. ఆ కంపెనీలు వెనుదిరిగాయి. అయితే.. ఆ త‌ర్వాత ప‌రిస్థితుల్లో వ్యాక్సిన్ల అవ‌స‌రం పెరిగిపోవ‌డంతో.. భార‌త్ భ‌యోటెక్, సీరం ఇనిస్టిట్యూట్ టీకాల‌ను అనుమ‌తించింది. కానీ.. ఈ రెండు టీకాలు కూడా మూడో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్ జ‌ర‌గ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇప్పుడు ఈ రెండు సంస్థ‌లు అవ‌స‌రానికి స‌రిప‌డా ఉత్ప‌త్తి చేయ‌క‌పోవ‌డం.. సెకండ్ వేవ్ తార‌స్థాయిలో విజృంభించ‌డంతో.. అనివార్యంగా విదేశీ వ్యాక్సిన్ ను ఆహ్వానించాల్సి వ‌చ్చింది. కానీ.. కేంద్ర మంత్రితో భేటీ అయిన ఆయా కంపెనీల ప్ర‌తినిధులు.. 2023 వ‌ర‌కు టీకాను అందించే ఛాన్సే లేద‌ని తేల్చి చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు చాలా దేశాల నుంచి ఆర్డ‌ర్లు వ‌చ్చాయ‌ని, వాట‌న్నింటినీ అందించ‌డానికే రెండేళ్లు ప‌డుతుంద‌ని, ఆ త‌ర్వాత చూద్దామ‌ని చెప్పార‌ట‌.