Begin typing your search above and press return to search.

ఏప్రిల్ 1 నుంచి తాజ్ వీక్ష‌ణపై ఆంక్ష‌లు!

By:  Tupaki Desk   |   30 March 2018 5:33 PM GMT
ఏప్రిల్ 1 నుంచి తాజ్ వీక్ష‌ణపై ఆంక్ష‌లు!
X
తాజ్ మ‌హ‌ల్.....ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌సిద్ధి చెందిన ప‌ర్యాట‌క ప్రాంతం.....యునెస్కో గుర్తింపు పొందిన వార‌స‌త్వ క‌ట్టడం..... `న్యూ సెవెన్ వండ‌ర్స్` లో చోటు ద‌క్కించుకున్న భార‌తీయ క‌ళాఖండం....మొఘ‌ల్ శిల్ప - వాస్తు - నిర్మాణ క‌ళ‌కు నిలువెత్తు తార్కాణం.....కాలం చెక్కిలిపై క‌న్నీటి చుక్క .....అని విశ్వ‌క‌వి ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్ అద్భుతంగా వ‌ర్ణించిన దృశ్య‌కావ్యం.....కాలం చెక్కిట జాబిలి చుక్క ప్యార్ మ‌హల్..... తీర‌ని ప్రేమ‌కు స్మార‌క లేఖ‌ తాజ్ మ‌హ‌ల్ అంటూ సినీక‌వులు వ‌ర్ణించిన ప్రేమ మ‌హ‌ల్.....ప్రేమికుల గుండెల్లో `గూడు` క‌ట్టుకున్న జ్ఞాప‌కం.....ఇంత‌టి ప్రాముఖ్యం ఉంది గ‌నుకే ఆ అద్భుతాన్ని క‌నులారా వీక్షించేందుకు ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి ప్ర‌తిరోజూ వేలాదిమంది ప‌ర్యాట‌కులు వ‌స్తుంటారు. తాజ్ అందాల‌ను గంట‌ల త‌ర‌బ‌డి త‌నివి తీరా ఆస్వాదించి పుల‌క‌రించిపోతుంటారు. ఆ పాల‌రాతి అందాల‌ను వీక్షిస్తూ త‌న్మ‌య‌త్వంతో త‌మ‌ను తాము మైమ‌ర‌చిపోతుంటారు....తాజ్ ను చూస్తూ గంట‌ల కొద్దీ స‌మ‌యాన్ని గ‌డిపేస్తుంటారు. అయితే, ఇక‌పై తాజ్ అందాలను 3 గంట‌ల‌కంటే ఎక్కువ సేపు వీక్షించ‌కుండా ఆర్కియాలాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ ఐ) ఆంక్ష‌లు విధించింది. ఏప్రిల్ 1 నుంచి ఆ ఆంక్ష‌లు అమ‌లులోకి వ‌స్తాయ‌ని పేర్కొంది.

తాజ్ మహల్ ప్రాంగణంలో ఇకపై 3 గంటల కంటే ఎక్కువ సమయం గ‌డిపేందుకు వీలు లేకుండా ఏఎస్ ఐ ఆదేశాలు జారీ చేసింది. తాజ్ మహల్ సందర్శనకు వచ్చే వారి సంఖ్య అధికంగా ఉండటంతో తాకిడిని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా వారాంతాలు - సెలవు రోజుల్లో సందర్శకుల సంఖ్య అధికంగా ఉంటుంది. దానికి తోడు, వ‌చ్చిన వారంతా దాదాపుగా సాయంత్రం గేట్లు మూసే వరకు తాజ్ ప్రాంగణంలోనే గడుపుతుంటారు. ఆ ప్రాంగ‌ణం నిరంతరం రద్దీగా ఉండ‌డంతో ఏఎస్ ఐ తాజా నిర్ణ‌యం తీసుకుంది. టికెట్ కొనుగోలు చేసిన సమయం నుంచి 3 గంటలు మాత్రమే తాజ్ ప్రాంగణంలో ఉండేందుకు అనుమతిస్తారు. 3 గంటలకు మించి ఉండాలనుకునే సందర్శకులు అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని ఏఎస్ ఐ అధికారి ఒక‌రు తెలిపారు. 3 గంట‌ల స‌మ‌యం ముగిసిపోయిన ప‌ర్యాట‌కుల‌ను గుర్తించేందుకు అద‌న‌పు సిబ్బందిని కూడా నియ‌మించే యోచ‌న‌లో ఏఎస్ ఐ ఉన్న‌ట్లు చెప్పారు.

తాజ్‌ మహల్ వంటి పురాతన కట్టడాన్ని కాపాడేందుకు రోజువారీ పర్యాట‌కుల సంఖ్యను 40 నుంచి 50 వేలకు పరిమితం చేయాలని ఏఎస్ ఐ యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆన్‌ లైన్‌ - ఆఫ్‌ లైన్‌ కలిపి రోజుకు 40-50వేల టిక్కెట్లు మాత్రమే అమ్మాలని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌తి ఏటా తాజ్ ను 70-80 ల‌క్ష‌ల మంది సంద‌ర్శిస్తుంటారు. సెల‌వు రోజులు - వేస‌వి సెల‌వుల్లో రోజుకు 60వేల నుంచి 70వేల మంది తాజ్ ను సంద‌ర్శిస్తున్నారు. దీనికి తోడు - ప్ర‌తి ఏటా పర్యాటకుల సంఖ్య 10 నుంచి 15శాతం పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్ర‌తిరోజూ తాజ్ మ‌హ‌ల్ ను ఎంత‌మంది సంద‌ర్శించ‌వ‌చ్చు - ఆ క‌ట్ట‌డం పై ఎంత‌మంది తిర‌గ‌వ‌చ్చు అన్న విష‌యాల‌ను అంచ‌నా వేసేందుకు 2012లో నేషనల్‌ ఎన్విరాన్‌ మెంటల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(నీరి)ను ఏఎస్ ఐ నియ‌మించింది. ఆ క‌మిటీ స‌మ‌ర్పించిన తుది నివేదిక ప్రకారమే తాజ్ ప‌ర్యాట‌కుల సంఖ్య‌ను ప‌రిమితం చేయ‌డం, వీక్ష‌ణ స‌మ‌యంపై ఆంక్ష‌లు విధించ‌డం వంటి నిర్ణ‌యాల‌ను తీసుకున్నారు.