Begin typing your search above and press return to search.

డ్రాగ‌న్ కు 'డ్యూటీ'తో దెబ్బేసిన భార‌త్‌

By:  Tupaki Desk   |   8 Aug 2017 5:09 AM GMT
డ్రాగ‌న్ కు డ్యూటీతో దెబ్బేసిన భార‌త్‌
X
స‌రిహ‌ద్దు వివాదంతో భార‌త్ - చైనాల మ‌ధ్య ఇటీవ‌ల కాలంలో ఉద్రిక్త‌త‌లు పెరిగిన సంగ‌తి తెలిసిందే. క‌య్యానికి కాలు దువ్వుతున్న చైనా తీరును భార‌త్ త‌న మాట‌ల‌తోనూ.. చేత‌ల‌తోనూ క‌ట్ట‌డి చేస్తోంది. అయిన‌ప్ప‌టికీ చైనాకు బుద్ధి రాని ప‌రిస్థితి. చైనా ఆర్థిక‌స్థితికి కార‌ణం భార‌త్ లోకి వ‌స్తున్న వ‌స్తు ప్ర‌వాహం కూడా అన్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. ఆర్థికంగా అంత‌కంత‌కూ బలోపేతం అవుతూ.. ఇరుగుపొరుగు దేశాల‌తో స‌రిహ‌ద్దు పంచాయితీలు పెట్టుకుంటున్న చైనాకు డోక్లాం ఇష్యూలో ఊహించ‌ని షాకిచ్చింది భార‌త్.

అప్ప‌టి నుంచి నోటి మాట‌ల‌తో మైండ్ గేమ్ మొద‌లెట్టిన చైనా.. అవాకులు చ‌వాకులు పేలుతున్న సంగ‌తి తెలిసిందే. చైనా విష‌యంలో క‌టువుగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే డ్రాగ‌న్ దూకుడుకు క‌ళ్లెలు వేయ‌టం క‌ష్ట‌మ‌న్న ఆలోచ‌న‌తో గ‌తానికి భిన్నంగా భార‌త్ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తోంది. త‌న తీరును మోడీ స‌ర్కారు చైనాకు స్ప‌ష్టం చేసే ప్ర‌య‌త్నం చేసింది. అయిన‌ప్ప‌టికీ ఏదోలా కెల‌కాల‌ని చూస్తున్న చైనాకు ఇటీవ‌ల కాలంలో మోడీ స‌ర్కారు షాకుల మీద షాకులు ఇచ్చేస్తుంది.

మొన్న‌టికి మొన్న చైనాకు చెందిన షాంఘై ఫోస‌న్ ఫార్మాస్యూటిక‌ల్ గ్రూప్ న‌కు షాకిచ్చిన కేంద్రం తాజాగా చైనా నుంచి చౌక ధ‌ర‌ల‌కే దిగుమ‌తి అవుతున్న టైర్ల విష‌యంలో క‌న్నెర్ర చేసింది. చైనా నుంచి దిగుమ‌తి అయ్యే టైర్ల‌పై భారీ ప‌న్ను వేయ‌టం ద్వారా.. చౌక టైర్ల ప్ర‌వాహ‌నానికి చెక్ చెప్పిన‌ట్లుగా చెప్పొచ్చు. చైనా చౌక టైర్ల దిగుమ‌తి కార‌ణంగా దేశీయంగా ఉన్న టైర్ల కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

ఈ నేప‌థ్యంలో డైరెక్ట‌రేట్ ఆఫ్ యాంటీ డంపింగ్ అండ్ డ్యూటీస్ ఒక నివేదిక‌ను సిద్ధం చేసింది. దీని ప్ర‌కారం.. చైనా టైర్ల‌పై ట‌న్నుకు 277.53 నుంచి 452.33 డాల‌ర్ల వ‌ర‌కు (మ‌న రూపాయిల్లో చెప్పాలంటే ట‌న్నుకు రూ.29వేలు) సుంకం విధించాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. అదే జ‌రిగితే.. చైనా నుంచి వ‌చ్చే చౌక టైర్ల‌కు చెక్ పెట్టిన‌ట్లు అవుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. వాణిజ్య ప‌రంగా చైనాకు భార‌త్ ఇస్తున్న షాకులు.. ఆ దేశం ఊహించ‌ని రీతిలో ఉంటున్నాయ‌న్న మాట వినిపిస్తోంది. డ్రాగ‌న్ ఆర్థిక బ‌లుపును విధానప‌ర‌మైన నిర్ణ‌యాల‌తో దారికి తెచ్చే వీలుంద‌ని చెప్పొచ్చు.