Begin typing your search above and press return to search.

ఆ మ్యాచ్ కు మెన్ ఇన్ బ్లూ కాదు మెన్ ఇన్ ఆరెంజ్!

By:  Tupaki Desk   |   21 Jun 2019 8:38 AM GMT
ఆ మ్యాచ్ కు మెన్ ఇన్ బ్లూ కాదు మెన్ ఇన్ ఆరెంజ్!
X
మెన్ ఇన్ బ్లూ అన్నంత‌నే టీమిండియా గుర్తుకు వ‌స్తుంది. అయితే.. ఇంగ్లండ్‌తో ఈ నెల 30న జ‌రిగే మ్యాచ్ లో మాత్రం టీమిండియాను మెన్ ఇన్ ఆరంజ్ టీంగా మారిపోనుంది. ఎందుకిలా అంటే.. దానికో కార‌ణం లేక‌పోలేదు. ఇంగ్లండ్‌.. టీమిండియా రెండు జ‌ట్ల జెర్సీలు దాదాపుగా బ్లూ షేడ్స్ లోనే ఉంటాయి. దీంతో.. రంగులు వారీగా గుర్తించ‌టం కాస్త క‌ష్ట‌మ‌వుతుంది.

కొన్ని జ‌ట్ల జెర్సీ రంగులు దాదాపుగా ద‌గ్గ‌ర‌గా ఉంటాయి.. భార‌త్‌.. ఇంగ్లండ్ జ‌ట్ల క‌ల‌ర్స్ బ్లూలో ఉంటే.. సౌతాఫ్రికా.. బంగ్లాదేశ్ జ‌ట్ల జెర్సీలు గ్రీన్ క‌ల‌ర్ కు ద‌గ్గ‌ర‌గా ఉంటాయి. ఇంచుమించు ఒకే రంగు జెర్సీలున్న జ‌ట్ల మ‌ధ్య పోటీ జ‌రిగితే.. స్థానిక జ‌ట్టు త‌న ఒరిజ‌న‌ల్ రంగు జెర్సీల్ని వాడే వీలుంటుంది. కానీ.. దాని ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు మాత్రం క‌చ్ఛితంగా వేరే రంగు జెర్సీల‌ను వాడాల్సి ఉంటుంది. దీనికి త‌గ్గ‌ట్లే సౌతాఫిక్రా.. బంగ్లాదేశ్ మ‌ధ్య మ్యాచ్ లో ఈ రెండు జ‌ట్ల జెర్సీ రంగులు ద‌గ్గ‌రగా ఉండ‌టంతో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు ప‌సుపురంగు జెర్సీని ధ‌రించింది.

ఇదే రీతిలో తాజాగా ఇంగ్లండ్ తో జ‌రిగే మ్యాచ్ లో భార‌త్ ఆరంజ్ జెర్సీని ధ‌రించ‌నుంది. ముందు వైపు బ్లూ క‌ల‌ర్ తోనే ఉన్నా.. వెనుక ప‌క్క మాత్రం ఆరంజ్ క‌ల‌ర్ కొట్టొచ్చేట్లుగా క‌నిపిస్తోంది. ప్ర‌తి జ‌ట్టుకు త‌మ‌కు కేటాయించిన రంగు జెర్సీల‌తో పాటు.. మ‌రో రెండు రంగుల్ని ఆప్ష‌న్ గా ఉంచుతారు. వాటిల్లో ఏదో ఒక‌టి ఎంచుకోవాల్సి ఉంటుంది.

అయితే.. ఇక్క‌డ మ‌రో రూల్ కూడా ఉంది. ఏ జ‌ట్టు త‌మ జెర్సీ క‌ల‌ర్ ను మార్చాల‌న్న దానిపై కూడాఐసీసీ స్ప‌ష్టంగా విధివిధానాల్ని నిర్దేశించింది. ఏ జ‌ట్లు అయితే అతిధ్యం ఇస్తుందో ఆ జ‌ట్టు జెర్సీ మార‌దు. రెండో జ‌ట్టు త‌మ జెర్సీని మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ తో జ‌రిగే మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఆ జ‌ట్టు వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీకి అతిథ్య జ‌ట్టుగా ఉండ‌టంతో టీమిండియా త‌న జెర్సీని మార్చుకోవాల్సి ఉంటుంది. దీంతో.. మ‌నోళ్లు మెన్ ఇన్ ఆరంజ్ గా మారిపోనున్నారు.