Begin typing your search above and press return to search.

దేశంలో మొత్తం ఎన్ని రాజకీయపార్టీలో తెలుసా?

By:  Tupaki Desk   |   22 March 2019 6:08 AM GMT
దేశంలో మొత్తం ఎన్ని రాజకీయపార్టీలో తెలుసా?
X
గల్లీకో పార్టీ.. జిల్లాకో పార్టీ.. రాష్ట్రానికో పార్టీ.. కాదేదీ పార్టీలకు అనర్హం అన్నంతగా దేశంలో పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఎన్నికల వేళనే దేశంలో ఎన్ని పార్టీలున్నాయని లెక్కతేలిది. ఎందుకంటే కొత్త కొత్త గుర్తులతో అభ్యర్థులు వింత వింత పార్టీల నుంచి బరిలోకి దిగుతారు. ఆ గుర్తులతో సరిపోలిన ప్రధాన పార్టీల అభ్యర్థులను ముచ్చమెటలు పట్టిస్తారు.. దాదాపు ఓడించినంత పనిచేస్తారు.

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అసలు సోదిలో కూడా లేని సమాజ్ వాదీ ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ తరుఫున ట్రక్కు గుర్తుపై పోటీచేసిన అభ్యర్థులు రెండు చోట్ల టీఆర్ ఎస్ అభ్యర్థులను ఓడించారు. చాలా చోట్ల 10వేలకు పైగా ఓట్లను చీల్చారు. టీఆర్ ఎస్ కారు గుర్తును పోలీ ఉండడమే దానికి కారణం. ఆ పార్టీకి ఈ సింబల్ ను టీఆర్ ఎస్ ఫిర్యాదు మేరకు ఈసీ నిషేధించింది.

ఇప్పుడు ఇలాంటి ఎన్నో మనకు తెలియని పార్టీలున్నాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ అసలు ఎన్నిపార్టీలున్నాయనే ఆసక్తి కొందరికి వచ్చింది. దీనిపై సమాచారం సేకరించగా.. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రకటన వెలువడడానికి ముందు రోజు వరకు అంటే మార్చి 9వ తేదీ వరకు 2293 పార్టీలున్నాయని ఈసీ తెలిపింది.

తాజాగా జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు ఎన్ని అనే విషయాలపై కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఓ ప్రకటనలో స్పష్టతనిచ్చింది. దేశంలో మొత్తం పార్టీలు 2293 కాగా.. ఇందులో ఏడు జాతీయ పార్టీలు - 59 ప్రాంతీయ పార్టీలు ఉన్నట్టు ఈసీ తెలిపింది. ఈ ఒక్క ఫిబ్రవరి - మార్చిలోనే 149 రాజకీయ పార్టీలు రిజిస్టర్ అయ్యాయని తెలిపింది. మొన్న డిసెంబర్ లో జరిగిన తెలంగాణ - చత్తీస్ ఘడ్ - రాజస్తాన్ - మిజోరం - మధ్యప్రదేశ్ 5 రాష్ట్రాల ఎన్నికల్లోనే 58 కొత్త పార్టీలు నమోదు కావడం విశేషం.

ఈసీ వద్దనున్న 84 గుర్తుల్లో ఏదో ఒకటిని కొత్త పార్టీలు ఎంచుకోవాలి. జాతీయ - రాష్ట్రస్థాయి పార్టీలుగా గుర్తింపును నిలబెట్టుకోవాలంటే.. కొత్త పార్టీలు ఎన్నికల్లో ఈసీ నిర్ధేశించిన ఓట్లు సాధించాల్సి ఉంటుంది.

ఇక 2005-2015 మధ్య ఎన్నికల్లో పోటీచేయని 255 రిజిస్టర్ పార్టీలను ఈసీ అన్ లిస్ట్ లో పెట్టింది. కొందరు బ్లాక్ మనీని వైట్ గా చేసుకునేందుకే ఇలా ఎన్నికల నిబంధనలలోని లొసుగులను ఆసరాగా చేసుకొని విరాళాలు పొందుతున్నాయని అందుకే అలాంటి వాటిని గుర్తించి ఈసీ ఇలాంటి అన్ లిస్ట్ లో పెడుతుంది.