Begin typing your search above and press return to search.

ఇండియా ఓపెన్‌ - బరిలో సింధు, శ్రీకాంత్‌

By:  Tupaki Desk   |   11 Jan 2022 8:43 AM GMT
ఇండియా ఓపెన్‌ - బరిలో సింధు, శ్రీకాంత్‌
X
కోవిడ్‌ పడగ విప్పడంతో రద్దయిన ‘ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ సూపర్‌-500’ టోర్నమెంట్‌ ఈ ఏడాది నిర్వహణకు సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఈ మేటి ఈవెంట్లో సత్తాచాటేందుకు మాజీ చాంపియన్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ సహా పలువురు స్టార్లు సై అంటున్నారు.

అయితే భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ క్రియాశీలం కావడంతో థర్ట్‌ వేవ్‌ (కోవిడ్‌ మూడో ముప్పు) ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కఠిన ప్రొటోకాల్‌ ప్రకారం పకడ్బందీగా ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఆర్గనైజర్లు గట్టి చర్యలు చేపట్టారు. కోర్టుల్లో ఆటగాళ్లు, కోర్టు వెలుపల సిబ్బంది తప్ప ప్రేక్షకుల స్టాండ్లలో ఎవరూ కనిపించరు.

టీవీల్లో తప్ప వేదిక వద్ద చూసేందుకు ఎవరికీ అనుమతి లేదు. ఒమిక్రాన్‌ ఉధృతి కొనసాగుతున్నప్పటికీ భారత స్టార్లు సహా విదేశీ టాప్‌స్టార్లు, ప్రపంచ చాంపియన్‌ షట్లర్లు ఇండియా ఓపెన్‌ ఆడేందుకు ఇది వరకే భారత్‌ చేరుకున్నారు. ప్రపంచ పురుషుల చాంపియన్‌ లో కియన్‌ వీ (సింగపూర్‌), మలేసియా టాప్‌స్టార్స్‌ ఒంగ్‌ వి సిన్‌, టియో యి యి, ఇండోనేసియా చాంపియన్లు మొహమ్మద్‌ అసాన్‌, హెండ్రా సెతివాన్‌ తదితరుల ఆటతో ఇందిరా గాంధీ స్టేడియం కళకళలాడనుంది.

ఇక భారత్‌ విషయానికొస్తే ఆతిథ్య ఫేవరెట్లు సింధు, శ్రీకాంత్‌లపై అందరి కళ్లున్నాయి. 2017 ఇండియా ఓపెన్‌ విజేత అయిన సింధు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన ఉత్సాహంతో ఉండగా, 2015 చాంపియన్‌ శ్రీకాంత్‌ ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఇద్దరు మరోసారి ఈ టోర్నీలో టైటిల్‌ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. మహిళల టాప్‌సీడ్‌ సింధు తొలిరౌండ్లో సహచర క్రీడాకారిణి శ్రీకృష్ణప్రియాతో, పురుషుల టాప్‌సీడ్‌ శ్రీకాంత్‌ కూడా తొలిరౌండ్లో భారత సహచరుడు సిరిల్‌ వర్మతో తలపడనున్నాడు.

మరో పురుషుల సింగిల్స్‌లో వర్మ బ్రదర్స్‌ తొలిరౌండ్లోనే తేల్చుకోనున్నారు. ఆరో సీడ్‌ సమీర్‌ వర్మ... సౌరభ్‌ వర్మను ఎదుర్కోనున్నాడు. గాయాలతో ఈ సీజన్‌ టోర్నీలకు వెటరన్‌ స్టార్స్‌ సైనా నెహ్వాల్‌, పారుపల్లి కశ్యప్‌ దూరం కాగా... ఈ టోర్నీ ఆడేందుకు వచ్చిన స్టార్‌ ఆటగాడు భమిడిపాటి సాయిప్రణీత్‌ కరోనాతో క్వారంటైన్‌కు చేరాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తెలుగమ్మాయి సిక్కిరెడ్డి-ధ్రువ్‌ కపిల జోడీ... భారత్‌కే చెందిన చిరాగ్‌ అరోరా-నిషు రాప్రియా జంటతో, పుల్లెల గాయత్రీ గోపీచంద్‌-సాయి ప్రతీక్‌ ద్వయం... ఇషాన్‌ భట్నాగర్‌-తానిషా క్రాస్టో (భారత్‌) జోడీతో పోటీపడతారు.