Begin typing your search above and press return to search.

భారత్ లో వైరస్ విజృంభణ ...యూకేను వెనక్కినెట్టి 4 స్థానంలోకి !

By:  Tupaki Desk   |   12 Jun 2020 5:45 AM GMT
భారత్ లో వైరస్ విజృంభణ ...యూకేను వెనక్కినెట్టి 4 స్థానంలోకి !
X
భారత్‌ లో మహమ్మారి జోరు చాలా ఉదృతంగా కొనసాగుతోంది. రోజుకు సుమారు 10వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. అత్యధిక కేసులు రికార్డువుతుండడంతో మిగతా దేశాలను భారత్ వేగంగా దాటేస్తోంది. ప్రపంచంలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు నాలుగో స్థానంలో ఉన్న బ్రిటన్‌ను దాటేసింది. 20,74,397 కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో బ్రెజిల్ (7,87,489) - రష్యా (5,02,436) వరుసగా రెండు - మూడో స్థానాల్లో కొనసాగుతున్నాయి.

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 9,996 కొత్త వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 357 మంది మరణించారు. తాజా లెక్కలతో దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,86,589కి చేరింది. వీరిలో ఈ మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 1,41,029 మంది కోలుకోగా.. 8,102 మంది మరణించారు. ప్రస్తుతం మనదేశంలో 1,37,448 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

భారత్ మే 24న టాప్ 10 జాబితాలోకి చేరగా.. కేవలం 18 రోజుల్లోనే నాలుగో స్థానానికి ఎగబాకడం గమనార్హం. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలను దాటుకుంటూ నాలుగో స్థానానికి చేరుకుంది. లాక్‌ డౌన్ సడలింపులు ఇచ్చి వివిధ కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చిన తర్వాత భారత్‌ లో కేసులు ప్రమాదకర రీతి లో పెరుగుతున్నాయి. గత 8 రోజుల్లోనే 80 వేల కేసులు, 2 వేలకు పైగా మరణాలు చోటు చేసుకున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.