Begin typing your search above and press return to search.

గీత దాటితే.. తలరాతే మారిపోతుంది..! ఇండియా పాకిస్థాన్​ బార్డర్​.. వెరీ డేంజర్​!

By:  Tupaki Desk   |   23 Nov 2020 11:30 PM GMT
గీత దాటితే.. తలరాతే మారిపోతుంది..!  ఇండియా పాకిస్థాన్​ బార్డర్​.. వెరీ డేంజర్​!
X
ఏ రెండు దేశాలమధ్యలో అయినా సరిహద్దు రేఖలు చాలా కీలకం. అక్కడ విధులు నిర్వర్తించే సైనికులు ప్రాణాలు ఫణంగా పెట్టి పనిచేయాల్సిందే. సరిహద్దు గ్రామాల్లో బతికే ప్రజల పరిస్థితి కూడా దుర్భరంగా ఉంటుంది. ఈ రెండు దేశాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా ఏ వివాదం వచ్చినా వాళ్ల చావుకొస్తుంది. నిరంతరం బిక్కుబిక్కుమంటూ ఎప్పుడు ఏ ఆపద ముంచుకొస్తుందో తెలియక అక్కడి వాళ్లంతా క్షణమొక యుగంగా గడుపుతుంటారు.

అయితే దాయాది దేశాల మధ్య పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. భారత్​.. పాకిస్థాన్​తో సరిహద్దును పంచుకున్నది. అక్కడి సరిహద్దుల్లో ఉన్న ప్రజలు ఎంతో నరకం అనుభవిస్తారు. ఎప్పుడు ఏ తుపాకి గుండు తమను గుండెల్ని చీల్చుతుందో తెలియక ప్రాణభీతితో బతుకుతారు. పొరపాటున ఎవరైనా బార్డర్​ దాటారంటే వారికి ఇక నరకమే..!
పాకిస్థాన్​కు చెందిన ఫరూక్​ అనే యువకుడు 2005లో బార్డర్​ దాటాడు. ఆతర్వాత అతడిని బీఎస్​ఎఫ్​ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేయగా కోర్టు శిక్ష విధించింది. ఎప్పటికైనా తన కొడుకు తిరిగి వస్తాడని ఫారూక్​ తల్లి ఎదురుచూస్తున్నది. ఆమె తన కొడుకును ఎలాగైనా కాపాడాలని.. అందుకోసం తాను ఏ త్యాగమైన చేస్తానని పాకిస్థాన్​ ప్రధానికి లేఖ రాసింది. కానీ ఆమె మొరను ఎవరూ ఆలకించలేదు. చివరికి రెడ్​క్రాస్​ సొసైటీకి తన బాధను చెప్పుకున్నది. వారు ఆరా తీస్తే ఫరూక్​ రాజస్థాన్​లోని జైల్లో ఉన్నట్టు తెలిసింది. అనంతరం వాళ్లు జైలుకెళ్లి ఫరూక్​ను కలిశారు. తర్వాత ఆమె తల్లికి లేఖ కూడా రాశారు. కానీ ప్రస్తుతం ఆ తల్లి ఎక్కడుందో..! ఫరూక్​ బతికే ఉన్నాడో లేదో కూడా తెలియదు.

మరో వృద్ధుడు పశువులు మేపుతూ బార్డర్​ దాటాడు. దీంతో భారత బీఎస్​ఎఫ్​ అతడిని అరెస్ట్​ చేసింది. అతడు జమ్మూ సెంట్రల్​ జైల్లో ఉన్నాడు. అయితే పాకిస్థాన్​ అధ్యక్షుడిగా జనరల్​ ఫర్వేజ్​ ముషారఫ్​ ఉన్నప్పుడు.. ఆ వృద్ధుడి కుమారుడు ముషారఫ్​కు లేఖ రాశాడు. తన తండ్రిని ఎలాగైనా విడిపించాలని కోరారు. కానీ ఆ యువకుడి కోరిక నెరవేరలేదు. ఎన్నో ఏళ్లుగా సరిహద్దు గ్రామాల దగ్గర ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అన్యాయంగా అనేకమంది జైళ్లలో మగ్గుతున్నారు. వాళ్లను పట్టించుకొని విడిపించుకొనే వారు కరువయ్యారు.

షంషాద్ బేగం అనే మహిళ భర్త 13 ఏళ్ల క్రితం కనబడకుండా పోయారు. భర్త కోసం అప్పటి నుంచి ఆమె వెదుకుతోంది. షంషాద్​ బేగం కుటుంబం పాకిస్థాన్​లోని నీలం ఘాటీలోని చక్‌నార్ ఉండేవారు. ఈ ప్రాంతం ఎల్ఓసీకి 50 మీటర్ల దూరంలో ఉంది. ఆ గ్రామంలోనికి రాకపోకలకు ఎవ్వరికీ అనుమతి లేదు. చక్‌నార్ గ్రామానికి వెళ్లే ఒక దారి భారత సైనికుల చెక్ పోస్ట్ గుండా వెళుతుంది. షంషాద్​ బేగం భర్త పాకిస్థాన్​ జవాన్ల బట్టలు ఉతికేవాడు. అతడికి ప్రభుత్వ ఉద్యోగం కూడా కాదు. ఓ రోజు పొరపాటున బార్డర్​ దాటి భారత జవాన్లకు చిక్కాడు. ఇప్పటివరకు అతడి జాడ లేదు. షంషాద్​ బేగం తన భర్తకోసం ఎంతో వెతికింది. ఇరు దేశాల ఆర్మీలకు ఎన్నో లేఖలు రాసింది. కానీ పట్టించుకొనేవారు లేరు. పాక్​, భారత్​ సరిహద్దుల్లో ఇటువంటి గాథలు ఎన్నో ఉన్నాయి.

భారత్-పాకిస్థాన్​ ఏమంటున్నాయి.. !

గతంలో ఎవరైనా బార్డర్​ దాటితే బలగాలు వాళ్లను అదుపులోకి తీసుకొని.. కొన్ని ప్రశ్నలు అడిగి తిరిగి పంపించేవి. కానీ 2019 ఆగస్ట్​5 తర్వాత ఉద్రిక్తతలు పెరిగాయి. భారత బలగాలు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ప్రతి ఒక్కరిని ఉగ్రవాదిగా అనుమానిస్తున్నారు. ఈ అంశాన్ని యూఎన్‌లో చర్చించమని విదేశాంగ శాఖకు లేఖ రాస్తాను" అని పాకిస్థాన్​కు చెందిన అధికారులు అంటున్నారు. అయితే ఈ వాదనను భారత విదేశాంగశాఖ తోసిపుచ్చింది. పాకిస్థాన్​ ప్రేరేపిత ఉగ్రవాదులు వాస్తవాధీనరేఖ దాటి వస్తున్నారని.. అందుకే వారిని అదుపులోకి తీసుకుంటున్నామని భారతవిదేశాంగ శాఖ అధికారులు అంటున్నారు.