Begin typing your search above and press return to search.

పండగప్పుడు స్వీట్లు.. విడి రోజుల్లో ఫైరింగా?

By:  Tupaki Desk   |   12 Nov 2015 4:38 AM GMT
పండగప్పుడు స్వీట్లు.. విడి రోజుల్లో ఫైరింగా?
X
నిత్యం ఉద్రిక్తంగా.. ఏ నిమిషాన ఏం జరుగుతుందోనన్న టెన్షన్ తో భారత్.. పాక్ సరిహద్దు ప్రాంతాలు ఉండటం తెలిసిందే. విడి రోజుల్లో ఎలా ఉన్నా.. కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో మాత్రం సరిహద్దుల్లోని భారత్.. పాక్ సైనిక సిబ్బంది మధ్య కాస్త స్నేహపూర్వక వాతావరణం కనిపిస్తుంటుంది. అయితే.. ఈ ధోరణి మొత్తం సరిహద్దుల్లో కాకుండా.. కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లోనే ఉండటం గమనార్హం.

గత కొద్ది నెలలుగా భారత్.. పాక్ సరిహద్దుల వద్ద దాయాది దేశం కాల్పుల కవ్వింపునకు తెగబడటం.. దానికి ధీటుగా సమాధానం ఇచ్చే క్రమంలో రెండు దేశాల సరిహద్దుల్లో ఉద్రికత్త చోటు చేసుకోవటం తెలిసిందే. దీనికి భిన్నమైన సీన్ బుధవారం చోటు చేసుకుంది. దీపావళి సందర్భంగా భారత్.. పాక్ కు చెందిన పలు సరిహద్దు ప్రాంతాల్లో స్నేహభావం కనిపించింది. దీపావళిని పురస్కరించుకొని భారత్.. పాక్ సైన్యాలు మిఠాయిలు పంచుకున్నాయి.

పంజాబ్ లోని అమృతసర్ లోని అట్టారి సరిహద్దు వద్ద భారత.. పాక్ సైనికులు మిఠాయిలు పంచుకున్నారు. ఇరు దేశాల కమాండర్ల అధ్వర్యంలో సిబ్బంది మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రత్యేక దినాలు.. పండుగ దినాల్లో కాకుండా.. విడిరోజుల్లో ఇలాంటి స్నేహమే రెండు దేశాల సరిహద్దుల వద్ద నెలకొని ఉంటే.. భద్రతాపరంగా రెండు దేశాలు వెచ్చిందే వందలాది కోట్ల రూపాయిలు సంక్షేమం మీద పెట్టి.. రెండు దేశాలు అభివృద్ధి చెందే వీలుంది.

పండగల సందర్భంగా మిఠాయిలు ఇచ్చినంత మాత్రాన.. దాయాది దేశాన్ని నమ్మటానికి వీల్లేని పరిస్థితి. దీపావళి సందర్భంగా ఇరు దేశాలకు చెందిన కమాండర్లు ఆలింగనం చేసుకోవటం.. శుభాకాంక్షలు చెప్పుకోవటం లాంటివి విడి రోజుల్లో కనిపించే ఛాన్స్ లేదు. అయినా.. సైనికులదేముంది? రెండు దేశాల ప్రభుత్వాలు తీసుకునే రాజకీయ నిర్ణయాలకు అనుగుణంగా సరిహద్దుల దగ్గర పరిస్థితులు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.