Begin typing your search above and press return to search.

భారత్ -పాక్ మ్యాచ్: నో బాల్ పై రచ్చ రచ్చ

By:  Tupaki Desk   |   25 Oct 2022 4:08 AM GMT
భారత్ -పాక్ మ్యాచ్: నో బాల్ పై రచ్చ రచ్చ
X
మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే ప్రత్యర్థి జట్టు మరింత బాగా ఆడితే బాగుంటుందని.. లేకుంటే కిక్కు రాదన్న భావనకు ఇటీవల జరిగిన భారత్ - పాక్ మద్య మ్యాచ్ సందర్భంగా ఫీలైన సంగతి తెలిసిందే. అలాంటి మ్యాచ్.. చివరికి వచ్చేసరికి నరాలు తెగిపోయేంత ఉత్కంటకు గురి కావటం.. ఆఖరి ఓవర్లో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవటం.. టీమిండియా అభిమానులు అయితే స్టేడియంలోనే దీపావళి పండుగను చేసుకున్న వైనం తెలిసిందే. అయితే..ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ పై ఇప్పుడు వివాదం నడుస్తోంది.

ఈ ఓవర్లో చివర్లో ఇచ్చిన నో బాల్ పై వాదోపవాదాలు వినిపిస్తున్నాయి. పాక్ బౌలర్ మహ్మద్ నవాజ్ వేసిన బంతిని అంపైర్లు నో బాల్ గా ప్రకటించటాన్ని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. కొందరు అంపైర్లు ప్రకటించిన నో బాల్ ను సమర్థిస్తుంటే.. మరికొందరు మాత్రం తప్పు పడుతున్నారు. మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేసిన చివరి ఓవర్లో నాలుగో బంతిని నవాజ్ ఫుల్ టాస్ వేయగా..కోహ్లి దాన్ని సిక్సర్ గా మలచటంతో మ్యాచ్ ఫలితం మారిపోయింది.

అయితే.. నడుము ఎత్తులో వచ్చిన ఈ బంతిని నో బాల్ గా ప్రకటించటంపై పాక్ జట్టు సభ్యులు అంపైర్ తో వాదించినా.. ఆయన తన అభిప్రాయాన్ని మాత్రం మార్చుకోలేదు. అయితే.. నో బాల్ తర్వాత ఫ్రీ హిట్ గా వచ్చిన బంతికి కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వికెట్లు పడిన తర్వాత బౌండరీ దిశగా బంతి దూసుకెళ్లటం.. నిబంధనల ప్రకారం తమకున్న అవకాశాన్ని వినియోగించుకొని కోహ్లి - దినేశ్ కార్తీక్ లు మూడు పరుగులు తీశారు.

ఫ్రీ హిట్ అయినప్పటికీ బ్యాట్స్ మెన్ బౌల్డ్ అయినప్పటికీ ఔట్ ఉండదన్న నిబంధనను కోహ్లి చక్కగా వినియోగించుకున్నాడు. ఈ బంతితోనే మ్యాచ్ భారత్ వైపునకు వచ్చింది. చివర్లో రెండు బంతులకు రెండు పరుగులు అవసరమయ్యాయి. రెండు బంతుల్లో ఒక్కో పరుగు చొప్పున చేయటంతో మ్యాచ్ ను సొంతం చేసుకోవటంతో పాటు.. పోరాటపటిమతో విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియా జట్టుపై ప్రశంసల వర్షం కురిసింది. అన్నింటికి మించి కోహ్లి వీరోచిత బ్యాటింగ్ వైనానికి అందరూ ఫిదా కావటమే కాదు.. మ్యాచ్ అయ్యాక జట్టు కెప్టెన్ అతన్ని తన భుజాన ఎత్తుకున్న వైనం చూస్తే..ఈ మ్యాచ్ విజయంలో కోహ్లి రోల్ ఎంతన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

చివరి ఓవర్లో అంపైర్లు ఇచ్చిన నో బాల్ మీద ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ ట్విటర్ లో కొన్ని సందేహాల్ని వ్యక్తం చేయటంతో ఇదో ఇష్యూగా మారింది. నడుము ఎత్తులో వచ్చిన బంతిని అంపైర్లు రివ్యూ తీసుకోకుండా నో బాల్ గా ఏలా ప్రకటించారన్నది ఆయన ప్రధాన సందేహం. ఫ్రీ హిట్ బాల్ కు కోహ్లి బౌల్డ్ అయినప్పుడు.. దాన్ని డెడ్ బాల్ గా ఎందుకు ప్రకటించలేదు? అన్నది ఆయనకున్న మరో ప్రశ్న. ఈ వాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నో బాల్ గా ప్రకటించిన బంతిని ఎదుర్కొనే వేళలో కోహ్లి దాదాపు క్రీజ్ బయట ఉన్నాడని.. అలాంటప్పుడు నడుము ఎత్తుపైకి వచ్చినా నో బాల్ కాదన్నది కొందరి వాదన.

అయితే.. ఈ ఇష్యూలో అంతిమ నిర్ణయం అంపైర్లదేనని.. దానికి ఇరు జట్లు కట్టుబడి ఉండాలని ఇంకొందరు వాదిస్తున్నారు. ఒక అద్భుతమైన మ్యాచ్ విషయంలో నడుస్తున్న ఈ చర్చ సోషల్ మీడియాలో హాట్ హాట్ గా మారుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.