Begin typing your search above and press return to search.

యుద్ధం వస్తే ఎవరి 'సత్తా' ఎంత?

By:  Tupaki Desk   |   27 Feb 2019 10:25 AM GMT
యుద్ధం వస్తే ఎవరి సత్తా ఎంత?
X
పుల్వామా దాడి అనంత‌రం బోర్డర్ వ‌ద్ద టెన్ష‌న్ వాతావ‌ర‌ణం ఉన్న విష‌యం తెలిసిందే. ఈ దాడి అనంత‌రం మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున జైషే స్థావ‌రాల‌పై భార‌త వాయుసేన దాడి చేసి వాటిని భూస్థాపితం చేసింది. ఈ నేప‌థ్యంలో రెండు దేశాల మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. దీంతో స‌హ‌జంగానే యుద్ధం వ‌స్తే ఏం జ‌ర‌గ‌నుంద‌నే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది. యుద్ధం వ‌స్తే...యుద్ధంలో ఎవ‌రి స‌త్తా ఎంతా అన్న ఆలోచ‌న వ‌స్తుంది. ఆర్థికంగా - జ‌నాభా ప‌రంగా రెండు దేశాలు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక‌ప‌రంగా ఇండియా ముందంజ‌లో ఉంది. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ సుమారు 2 ల‌క్ష‌ల 70 వేల కోట్ల‌ డాల‌ర్లు. ఇక పాక్ ఆర్థిక వ్య‌వ‌స్థ విలువ సుమారు 30 వేల 700 కోట్ల డాల‌ర్లు మాత్ర‌మే. భార‌త జ‌నాభా 120 కోట్లు - ఇక పాక్ జ‌నాభా 20 కోట్లు మాత్ర‌మే. భార‌త్ త‌న మిలిట‌రీ కోసం గ‌త బ‌డ్జెట్‌ లో సుమారు 5800 కోట్ల డాల‌ర్లు కేటాయించింది. ఇది ర‌ష్యా మిలిట‌రీ బ‌డ్జెట్‌ తో దాదాపు స‌మానంగా ఉంది. ప్రపంచ‌దేశాల్లో మిలిట‌రీ ప‌రంగా భార‌త్ అయిద‌వ స్థానంలో ఉంది. ఇక పాక్ త‌న మిలిట‌రీ బ‌డ్జెట్ కోసం 1100 కోట్ల డాల‌ర్లు వెచ్చించింది. వాస్త‌వానికి వాళ్ల బ‌డ్జెట్‌ లో ఇది పెద్ద మొత్త‌మేన‌ని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇక కీల‌క‌మైన సైనిక సంప‌త్తి విష‌యానికి వ‌స్తే - పాక్ ఆర్మీలో సుమారు 5 ల‌క్ష‌ల 60 వేల మంది సైనికులు ఉన్నారు. ఇక భార‌త ఆర్మీలో సుమారు 10 ల‌క్ష‌ల 20వేల‌ మంది జ‌వాన్లు ఉంటారు. భార‌త్ వ‌ద్ద యుద్ధ ట్యాంక్‌ లు సుమారు 3500 ఉన్నాయి. ఇది పాకిస్థాన్ కంటే సుమారు వెయ్యి ఎక్కువ‌. ర‌ష్యా త‌యారు చేసిన టీ-90 యుద్ద ట్యాంకులే భార‌త్ వ‌ద్ద ఎక్కువ సంఖ్య‌లో ఉన్నాయి. ఇక పాక్ వ‌ద్ద మాత్రం ఎక్కువ‌గా చైనా నుంచి దిగుమ‌తి చేసుకున్న యుద్ధ వాహ‌నాలు ఉన్నాయి. భార‌త్ సుమారు 10వేల కేంద్రాల నుంచి ఆర్మీ యూనిట్ల‌ను ఆప‌రేట్ చేస్తుంది. అయితే పాక్‌ లో మాత్రం కేవ‌లం 5 వేల యూనిట్లు మాత్ర‌మే ఉన్నాయి. ఇక ఇండియా వ‌ద్ద సుమారు 3100 ఇన్‌ ఫాంట‌రీ యుద్ధ వాహ‌నాలు ఉన్నాయి. ఈ వాహ‌నాలు సైనికుల‌ను తీసుకెళ్ల‌గ‌ల‌వు. పాక్ వ‌ద్ద 425 యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటిల్లో ఫ్రాన్స్‌ - అమెరికా - చైనా దేశాల‌కు చెందిన జెట్స్ ఉన్నాయి. ఇండియా వ‌ద్ద సుమారు 800 యుద్ధ విమానాలు ఉన్నాయి. కానీ వాటిల్లో ఎక్కువ శాతం ర‌ష్యా వాడిన విమానాలే. ఈ జాబితాలో మిగ్ 21 - మిగ్ 27 యుద్ధ విమానాలు ఉన్నాయి. భార‌త్ వ‌ద్ద బ‌ల‌మైన సుఖోయ్ 30 విమానాలు కూడా ఉన్నాయి. అయితే భార‌త వైమానిక ద‌ళం వ‌ద్ద క‌నీసం 200 సుఖోయ్‌ లు ఉన్న‌ట్లు అంచ‌నా. ఇక నేవీలో మాత్రం భార‌త్ చాలా మెరుగ్గా ఉంది. తీర ప్రాంత పెద్ద‌ది కావ‌డం కూడా మ‌న‌కు అడ్వాంటేజ్‌. కానీ ప్ర‌స్తుతం యుద్ధం అంతా క‌శ్మీర్ గురించే కాబ‌ట్టి.. నేవీ ఉప‌యోగం త‌క్కువే ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

అయితే, అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన అంశాల్లో అణ్వాయుధం ఒక‌టి. ఈ విష‌యంలో మాత్రం పాకిస్థాన్‌ కు ముందు చేయి ఉన్న‌ట్లు కొన్ని దేశాలు అంటున్నాయి. రెండు దేశాలూ 1990వ ద‌శ‌కంలోనే న్యూక్లియ‌ర్ బాంబుల‌ను ప‌రీక్షించాయి. అయితే స్టాక్‌ హోమ్ ఇంట‌ర్నేష‌న‌ల్ పీస్ రీచ‌ర్చ్ ఇన్ స్టిట్యూట్ ప్ర‌కారం.. పాకిస్థాన్ వ‌ద్ద సుమారు 140 నుంచి 150 వ‌ర‌కు అణ్వాయుధాలు ఉన్నాయి. భార‌త్ వ‌ద్ద మాత్రం 130 నుంచి 140 వ‌ర‌కే న్యూక్లియ‌ర్ వార్‌ హెడ్స్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. కానీ అణ్వాయుధాల‌ను మోసుకెళ్లే స‌త్తా మాత్రం భార‌త్‌ కే ఎక్కువగా ఉంది. మ‌న వ‌ద్ద అగ్ని 3 రాకెట్లు ఉన్నాయి. ఈ రాకెట్లు క‌నీసం 5 వేల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ ను షూట్ చేయ‌గ‌ల‌వు. ఇక పాక్ ద‌గ్గ‌ర ఉన్న షెహీన్ రాకెట్ మాత్రం కేవ‌లం 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ ను మాత్ర‌మే ధ్వంసం చేయ‌గ‌ల‌దు. యుద్ధ ప్రాతిప‌దిక అంశాల్లో భార‌త్ ముందున్నా.. ఒక‌వేళ అదే అనివార్య‌మైతే .. రెండు దేశాల‌కు ప్రాణ‌న‌ష్ట‌మే మిగులుతుందని చెప్తున్నారు.