Begin typing your search above and press return to search.

ట్రంప్ ను మెప్పించేందుకే మాతో విరోధంః చైనా

By:  Tupaki Desk   |   3 July 2017 2:56 PM GMT
ట్రంప్ ను మెప్పించేందుకే మాతో విరోధంః చైనా
X
చైనా మ‌రోసారి త‌న కుటిల బుద్ధిని బ‌య‌ట‌పెట్టింది. త‌న ప‌స‌లేని ఆరోప‌ణ‌ల‌తో భార‌త్ పై బుర‌ద జ‌ల్లుతోంది. ప్ర‌పంచంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న తమను భార‌త్ అడ్డుకుంటోంద‌ని విమ‌ర్శించింది. త‌మ ఎదుగుద‌ల‌ను ఓర్వ‌లేకే ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు సరిహద్దులో భారత ఆర్మీ బలగాలు త‌మ‌తో గొడ‌వ‌ప‌డ్డాయ‌ని చైనా ఆరోపించింది. ఈ నేప‌థ్యంలో చైనా జాతీయ పత్రిక ఓ అద్భుత‌మైన విష‌పూరిత‌ కథనాన్ని వండివార్చింది.

ట్రంప్ మెప్పు కోస‌మే ఇండియా - చైనా బోర్డర్‌లో భార‌త సైన్యం అలజడి రేపింద‌ని ఆ క‌థ‌నంలో పేర్కొంది. చైనా బలగాలు భారత పోస్టులోకి దూసుకొచ్చి బంకర్లను ధ్వంసం చేశాయని భారత బలగాలు పేర్కొన్నాయి. అయితే, తాము రోడ్డు వేయడానికి చేసిన ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు భారత దళాలు వచ్చాయని చైనా బుకాయించిన విష‌యం విదిత‌మే. చైనా అబ‌ద్ధం చెబుతోంద‌ని భారత్‌, భూటాన్‌లు తెలిపాయి.

డొక్లామ్‌లో రోడ్డు నిర్మాణం చేప‌ట్టిన చైనాకు వ్య‌తిరేకంగా భూటాన్‌ ఆర్మీ నినాదాలు చేసింది. తమ దేశం చేసిన తప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు గ్లోబల్‌ టైమ్స్ విశ్వ ప్ర‌య‌త్నం చేసింది. మోదీ-ట్రంప్‌ల మధ్య జరిగిన భేటీ వ‌ల్ల భార‌త్ లాభ‌ప‌డ‌ద‌ని త‌న అక్క‌సు వెళ్లగ‌క్కింది.

ట్రంప్‌, మోదీలు రెండు విభిన్న పాల‌సీల‌కు క‌ట్టుబ‌డి ఉంటార‌ని ఆ ప‌త్రిక తెలిపింది. 'డీ-గ్లోబలైజేషన్‌, అమెరికన్స్‌ ఫస్ట్‌ అనే పాలసీకి ట్రంప్‌ కట్టుబడి ఉంటారు. మోదీ ప్రపంచీకరణకు, మేక్‌ ఇన్‌ ఇండియా పాలసీకి కట్టుబడి ఉంటారు. వీరిద్దరి మధ్య సయోధ్య అసలు కుదరదని పేర్కొంది.

కాగా, ఇటీవల రక్షణ మంత్రి అరుణ్‌ జైట్లీ చేసిన ‘1962 నాటి భారత్‌ కాదు’ వ్యాఖ్యలపై చైనాకు స్పందించింది. దీంతో తాము కూడా అప్పటి చైనా కాదని, దేశ ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఎంత వరకైనా వెళ్తామని పేర్కొంటూ వ్యాఖ్యానించింది.

‘నిజమే 1962 నాటి పరిస్థితులతో పోలిస్తే 2017 నాటి భారత్‌కు తేడా ఉంది. అదే సమయంలో చైనా కూడా అంతే’ అని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జెంగ్‌ షువాంగ్ అన్నారు.

1890 నాటి ఒప్పందానికి అనుగుణంగా ఆ ప్రాంతంలో భారత్‌.. తమ భూబాగాన్ని వదిలి వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్‌ చేశారు. దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు ఎంత వరకు వెళ్లడానికి వెనకాడేది లేదంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు. అంతేకాదు.. డోక్లాం ప్రాంతంలో ప్రవేశించడానికి భూటాన్‌ ను భారత్‌ పావుగా వాడుకుంటోందని ఆరోపించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/