Begin typing your search above and press return to search.

విదేశీ తబ్లిగీలను బ్లాక్ లిస్టులో ఎందుకు పెడుతున్నారు?

By:  Tupaki Desk   |   3 April 2020 6:30 AM GMT
విదేశీ తబ్లిగీలను బ్లాక్ లిస్టులో ఎందుకు పెడుతున్నారు?
X
ఒక సదస్సు.. కరోనా వ్యాప్తికి కేరాఫ్ అడ్రస్ గా మారటమే కాదు.. కొత్త గుబులుకు కారణమైంది. మార్చి 13-15 మధ్య ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ కు వేలాది మంది హాజరైతే.. అందులో విదేశీయులే 1306 మంది ఉండటం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సదస్సు పూర్తి అయిన తర్వాత వారు పలు రాష్ట్రాలకు వెళ్లటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టూరిస్టు వీసాల్లో వచ్చిన వారు ఎట్టి పరిస్థితుల్లో మత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకూడదన్న ప్రాథమిక నిబంధనను విదేశీ తబ్లిగీలు ఉల్లంఘించినట్లుగా అధికారులు చెబుతున్నారు.

వీరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్రం ఇప్పుడు కోరుతోంది. సదస్సు పూర్తి అయిన తర్వాత సుమారు 250 మంది తమ దేశాలకు వెళ్లిపోతే.. మిగిలిన వారంతా మాత్రం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు వెళ్లిన వైనాన్ని గుర్తించారు. అది కూడా.. తెలంగాణలో పెద్ద ఎత్తున పాజిటివ్ కేసుల్ని గుర్తించిన వేళ.. వారి గురించి ఆరా తీసిన రాష్ట్ర యంత్రాంగం ఇచ్చిన నివేదికతో కేంద్రాన్ని అలెర్టు చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. అప్పటివరకూ నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

వీసా నిబంధనల్ని అతిక్రమించిన వారందరిపైనా చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. వారెక్కడ ఉన్నా వెనక్కి పిలిపించాలని.. విదేశీయుల చట్టం.. విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. లాక్ డౌన్ విధించిన తర్వాత కూడా నిజాముదీన్ దర్గాలో 2300 మంది ఒకే చోట ఉండటం.. వారిలో 250 మంది విదేశీయులు కావటం వివాదంగా మారింది.

అలా ఒకేచోట ఉన్న 2300 మందిలో మూడు వందల మంది పాజిటివ్ కావటం గమనార్హం. దేశ వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 450 కేసులు నిజాముదీన్ తో లింకు ఉండటం ఒక ఎత్తు అయితే.. పన్నెండు మరణాల విషయంలోనూ వీరిదే పాపం కావటం గమనార్హం. వీసా నిబంధనల్ని ఉల్లంఘించినట్లు చెబుతున్న కేంద్రం.. ఇంతకాలం ఏమి చేసినట్లు? కరోనా వేళ.. దేశమంతా అప్రమత్తంగా ఉండాల్సిన వేళ.. భారీ ఎత్తున నిర్వహిస్తున్న సదస్సు విషయంలో కేంద్రం ఏమి చేస్తున్నట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇవాల్టి రోజున చర్యలు పేరుతో హడావుడి చేస్తున్నారు బాగానే ఉంది. అసలు అంత భారీ సదస్సు జరిగి.. దానికి పెద్ద ఎత్తున విదేశీయులు వస్తున్నప్పుడు.. వారంతా ఏం చేస్తున్నారన్న అంశంపై డేగకన్ను ఎందుకు వేయలేదు? అన్న ప్రశ్నకు సమాధానం రావాల్సి ఉంది.