Begin typing your search above and press return to search.

'ఓవరాక్షన్‌ వద్దు' : సున్నితంగా చెప్పేసిన భారత్‌!

By:  Tupaki Desk   |   20 Jan 2015 5:25 PM GMT
ఓవరాక్షన్‌ వద్దు : సున్నితంగా చెప్పేసిన భారత్‌!
X
రిపబ్లిక్‌ డే ఉత్సవాల్లో పాల్గొనడానికి భారతపర్యటంకు వస్తోన్న అమెరికా అధ్యక్షుడి రక్షణ విషయంలో ఆ దేశం కాస్త ఓవర్‌ యాక్షన్‌ చేస్తోన్నట్లే కనిపిస్తోంది! ఈ విషయంలో భారత్‌ పై ఏకపక్ష ప్రతిపాదనలు చేస్తోంది అమెరికా సెక్యూరిటీ విభాగం! ఒబామా రక్షణ వారికి ఎంత అవసరమో అంతకంటే ఎక్కువగా... మనదేశ నాయకుల రక్షణ మనకూ అంతే అవసరం! రాష్ట్రపతి, ప్రధాని, సోనియా మొదలైన పెద్దలకు రక్షణ కల్పించుకోగలిగిన మన వ్యవస్థ ఒబామా ఒక్కడికీ రక్షణ కల్పించలేదా? ఈ వ్యవహారంలో కండిషన్స్‌ మీద కండిషన్స్‌ పెడుతోన్నారు అమెరికా అధికారులు! కవాతు జరిగే రాజ్‌పథ్‌ ప్రాంతంలో ఎత్తైన భవనాలపై తమ షార్ప్‌ షూటర్లను మోహరిస్తామని కోరుతోంది అమెరికా! ఈ ప్రతిపాదనను భారత్‌ సున్నితంగా తిరస్కరించడంతో పాటు తమ భద్రతా ఏర్పాట్లలో జోక్యం చేసుకోరాదని ముక్కుసూటిగా సూచించింది! వీవీఐపీలకు రక్షణ కల్పించే సుశిక్షితులైన మానవవనరులు, పరికరాలు తమ వద్ద ఉన్నాయని, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని, ఈ విషయంలో కేవలం తమ సిబ్బందిని మాత్రమే వినియోగించడం తప్పనిసరి అని భారత భద్రతాధికారులు సూచించారు!

అక్కడితో ఆగని అమెరికా అధికారులు... వేడుక జరిగే ప్రాంతాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని కూడా ప్రతిపాదించారు! ఈ విషయాన్ని కూడా భారత వైమానిక దళ అధికారులు తిరస్కరించారు! దీనివల్ల కవాతుకు ప్రధాన ఆకర్షణగా నిలిచే వైమానిక విన్యాసాలను రద్దు చేయాల్సి ఉంటుందని... ఆపని చేయలేమని సూటిగా చెప్పేశారు వైమానిక అధికారులు! అలాగే శకటాలకు చెక్‌పెట్టడానికి అమెరికా అధికారుల ఆలోచనను కూడా భారత్‌ తిరస్కరించింది. అక్కడికి కూడా ఆగని ఒబామా రక్షణ దళం మరో పరిపాదనతో భారత్‌ ముందుకు వచ్చారు! ప్రతి ప్రదేశానికి చేరుకోవడానికి మూడు మార్గాలు ఉండాలని... వాటిలో ఏమార్గం గుండా అమెరికా అధ్యక్షుడు ప్రయాణిస్తోన్నాడు అన్న విషయం మాకు మాత్రమే వదిలేయాలని... వాటిలో భారత్‌కు చెందిన ఇతర ప్రముఖుల వాహనాలు ప్రయాణిచేవి అయి ఉండకూడదని సూచిస్తోన్నారు! అయితే ఈ విషయంలో కూడా భారత్‌ అధికారులు ఏమాత్రం తగ్గడంలేదు! అథిదిగా వచ్చే వారికి మార్గ ప్రణాళికను ఆతిథ్య దేశమే నిర్ణయించాల్సి ఉంటుందని భారత అధికారులు తెగేసి చెప్పారు! దీనితో మరో దారిలేక, వారి రక్షణ వ్యవహారాలు వారు చూసుకుంటూ... భారత అధికారులకు సహకరిస్తోన్నారట అమెరికా అధికారులు!