Begin typing your search above and press return to search.

ట్రంప్‌ కు ఊహించ‌ని షాకిచ్చిన భార‌త్‌

By:  Tupaki Desk   |   5 April 2017 7:45 AM GMT
ట్రంప్‌ కు ఊహించ‌ని షాకిచ్చిన భార‌త్‌
X
త‌న‌దైన శైలిలో దూకుడు వ్యవహారాలకు పేరుగాంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌-పాకిస్తాన్ వివాదాల మధ్య తలదూర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా ఏం చేయగలుగుతుందనేది ఆలోచిస్తున్నామని ఐక్యరాజ్య సమితిలో అమెరికా ప్రతినిధి నిక్కీ హీలే చెప్పారు. అయితే భారత్-పాక్ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు అమెరికా చేసిన తాజా ప్రయత్నాన్ని భారత్ తిరస్కరించింది. త‌ద్వారా ట్రంప్ టీంకు షాకిచ్చింది.

పాక్‌తో ఉన్న అన్ని సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని, ఈ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది. అన్యదేశ జోక్యానికి ఆస్కారం లేకుండానే ఇరు దేశాల సమస్యలన్నీ ద్వైపాక్షికంగానే పరిష్కారం కావాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెగేసి చెప్పింది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతను తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్ర‌క‌ట‌న నేపథ్యంలో భారత ఈ నిర్వంద్వ ప్రకటన చేసింది. హింసా, ఉగ్రవాదానికి అతీతంగా శాంతియుత రీతిలోనే భారత్-పాక్ సమస్యలు పరిష్కారం కావాలన్నది తమ అభిమతమని స్పష్టం చేసింది. అయితే పాక్ ఉగ్రవాద చర్యలను అణచివేసే విషయంలో మాత్రమే అంతర్జాతీయ ప్రమేయాన్ని, జోక్యాన్ని కోరుతున్నామని తెలిపింది.

కాగా, భారత, పాకిస్తాన్ దేశాల మధ్య ఏదైనా జరిగేంత వరకు వేచి ఉండే బదులు ఏమీ జరగకముందే జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దటం మంచిదని అమెరికా భావిస్తోందని భారత సంతతికి చెందిన నిక్కి హేలీ వెల్లడించారు. ఈ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతను తగ్గించేందుకు అమెరికా జోక్యం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నదని నిక్కి హేలీ వ్యాఖ్యలు సూచిస్తున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఇంతకాలం భారత - పాకిస్తాన్‌ ల మధ్య నెలకొన్న వివాదాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే విధానాన్ని అవలంబించింది. అందుకే అమెరికా రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేసేందుకు ముందుకు వచ్చేదికాదు. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగిన సమయంలో పాకిస్తాన్‌ ను తీవ్రవాద దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేయటంద్వారా అమెరికాలోని భారత సంతతి ఓటర్ల మద్దతు కూడగట్టుకున్న ట్రంప్ ఇప్పుడు తన వైఖరిని మార్చుకున్నారని భావిస్తున్నారు. రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తమకు గల స్థానం ఏమిటనేది పరిశీలిస్తున్నామని అమెరికా చెబుతోంది. అమెరికా వైఖరిలో వచ్చిన మార్పు ముందు, ముందు రెండు దేశాల మధ్య నెలకొన్న సంబంధాలను దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదని పరిశీలకులు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/