Begin typing your search above and press return to search.

ఆ రెండు దేశాల‌తో మ‌న‌ది అ'నూనె' బంధం!

By:  Tupaki Desk   |   25 Feb 2022 6:56 AM GMT
ఆ రెండు దేశాల‌తో మ‌న‌ది అనూనె బంధం!
X
ప్ర‌స్తుతం యుద్ధంలో త‌ల‌మున‌క‌ల‌వుతున్న ర‌ష్యా-ఉక్రెయిన్‌తో మ‌న దేశ పౌరుల‌కు.. క‌న్యాకుమారి నుంచి కాశ్మీర్ వ‌ర‌కు కూడా ఎంతో సంబంధం ఉంది. నిత్యం మ‌నం వంట‌ల‌కు వినియోగించే స‌న్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్‌.. ఉక్రెయిన్ నుంచే ఎక్కువ‌గా దిగుమ‌తి అవుతుండ‌డం గ‌మ‌నార్హం. అదేవిదంగా ర‌ష్యా నుంచి కూడా ఈ నూనెలు ఎక్కువ‌గా మ‌నం తెచ్చుకుంటున్నారు. దీంతో ఈ రెండు దేశాల‌తోనూ మ‌న‌కు అన్యోన్య బంధం అనే బ‌దులు `అనూనె` బంధం ఉంద‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు.

గతేడాది మనదేశం 1.89 మిలియన్‌ టన్నుల పొద్దుతిరుగుడు పువ్వు నూనెను దిగుమతి చేసుకుంది. అందులో 70 శాతం ఉక్రెయిన్‌, 20 శాతం రష్యా నుంచే వచ్చింది. మరో 10 శాతం అర్జెంటీనా నుంచి వచ్చింది. మొత్తంమీద నెలకు 2-3 లక్షల టన్నుల ఈ నూనె దేశంలోకి దిగుమతి అవుతుంది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ నుంచి సరఫరా ఆగిపోయింది. ఉద్రిక్తత మరో 2-3 వారాలు కొనసాగితే మనకు ఇబ్బందే.

గోధుమలు ఎక్కువగా వినియోగించే దేశాల్లో మనదేశం ఒకటి కాగా.. ప్రపంచానికి ఎగుమతి చేసే దేశాల్లో రష్యా అగ్రగామి. గోధుమల నాలుగో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉక్రెయిన్‌ నిలిచింది. నల్ల సముద్రం ప్రాంతం నుంచి ఎక్కువగా గోధుమల సరఫరా జరుగుతుంది. రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల వల్ల వీటి సరఫరా స్తంభిస్తే, గోధుమల ధరలు పైకి చేరొచ్చు. ప్రస్తుతం భారత్‌ వద్ద 24.2 మిలియన్‌ టన్నుల నిల్వలు ఉండటంతో దేశీయ ఎగుమతిదార్లు దీన్ని అవకాశంగా వినియోగించుకోవాలని విశ్లేషకులు చెబుతున్నారు.

భారత్‌ నుంచి టీ అధికంగా కొనుగోలు చేసే దేశాల్లో రష్యా రెండో స్థానంలో ఉంది. మన ఎగుమతుల్లో 18 శాతం ఆ దేశానికి వెళ్తాయి. తాజా పరిణామాల నేపథ్యంలో టీ ఉత్పత్తిదార్లు, ఎగుమతిదార్లు కలవరపడు తున్నారు. రష్యాపై విధించిన ఆంక్షలతో చెల్లింపుల సమస్యలు తలెత్తవచ్చని భావిస్తున్నారు.

మొత్తంగా చూస్తే.. మ‌న దేశానికి అన్ని వైపుల నుంచి ఇబ్బందులు త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు.