Begin typing your search above and press return to search.

కుదేలైన రిటైల్ రంగం.. కష్టమేనట?

By:  Tupaki Desk   |   6 May 2020 2:11 PM GMT
కుదేలైన రిటైల్ రంగం.. కష్టమేనట?
X
కరోనా దెబ్బకు దేశాలకు దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లి పోయాయి. జనాలంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో రిటైల్ రంగం కుదేలైంది. భారత దేశంలో అయితే పరిస్థితి దారుణంగా మారింది. తాజాగా దేశంలో రిటైల్ రంగం ఎంత పతనమైందో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) వెల్లడించింది.

భారతదేశంలో 7 కోట్ల మంది వ్యాపారులున్న రిటైల్ రంగంలో రూ.5.5 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని సీఏఐటీతెలిపింది. 20శాతం మంది రిటైలర్లు రానున్న కాలంలో తమ వ్యాపారాలను మూసివేయనున్నట్టు ప్రకటించారు. కష్టకాలంలో వర్తకులను ఆదుకోవడానికి ప్యాకేజీని ప్రకటించాలని కేంద్రాన్ని కోరినట్టు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ వివరించారు.

లాక్ డౌన్ కారణంగా రిటైల్ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. 1.5 కోట్ల మంది వ్యాపారులు శాశ్వతంగా మూసి వేసుకున్నారు. భారత వర్తకుల రోజువారీ వ్యాపారం విలువ రూ.15000 కోట్లు. వర్తకులపై ఆధారపడ్డ 75 లక్షల మంది చిరువ్యాపారులు కూడా నష్టపోయారు. దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మంది సూక్ష్మ చిన్న వ్యాపారులు ఉంటారని తెలిపారు.

లాక్ డౌన్ ను తట్టుకునే బలం వ్యాపారులకు లేకుండా పోయిందని సీఏఐటీ తెలిపింది. వర్తకులు తమ ఉద్యోగుల జీతాలు, షాపుల అద్దెలు చెల్లిస్తున్నారని.. కస్టమర్ల ఆదాయం తగ్గిందని అందుకే వారు కొనడానికి ముందుకు రాకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని తెలిపారు. వ్యాపారులు సాధారణ స్థితికి రావడానికి 6-9 నెలల సమయం పడుతుందన్నారు. ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని.. అన్ని రంగాల్లో డిమాండ్ తక్కువగా ఉందన్నారు.

ప్రస్తుత దేశ ఆర్థిక వ్యవస్థ చూస్తుంటే తిరిగి రిటైల్ రంగం పుంజుకుంటుందన్న ఆశలు కోల్పోయామని ఖండేల్వాల్ వివరించారు. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే ఈ రంగం కుదేలు అవ్వడం ఖాయమన్నారు.