Begin typing your search above and press return to search.

రష్యాతో భారత్ భారీ రక్షణ ఒప్పందం!

By:  Tupaki Desk   |   15 Oct 2016 1:47 PM GMT
రష్యాతో భారత్ భారీ రక్షణ ఒప్పందం!
X
గోవా వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య కీలక సమావేశం జరిగింది. వీరిద్దరి భేటిలో భాగంగా ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. పుతిన్ సహకారంతో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి సిద్దంగా ఉన్నామని ప్రకటించిన మోడీ... రైల్వేలు - స్మార్ట్‌ సిటీలు - కుడంకుళం న్యూక్లియర్ ప్లాంట్ - నౌకా నిర్మాణం సహా పలు రంగాల్లో 16 ఒప్పందాలపై సంతకాలు జరిగినట్లుగా తెలిపారు.

ఈ సందర్భంగా భారత రక్షణ వ్యవస్థకు అత్యంత కీలకమైన డిఫెన్స్ డీల్‌ ను రష్యాతో భారత్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రూ.39,000 కోట్లతో అత్యంత అధునాతమైన విమాన విధ్వంసక రక్షణ వ్యవస్థ "ఎస్-400 ట్రియంఫ్‌" సేకరణకు రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, సూదూర లక్ష్యాలను ఛేదించ గలిగిన ఎస్-400 ట్రియంఫ్‌ లను కొనుగోలు చేయడం వ్యూహాత్మకంగా భారత్ తీసుకున్న కీలక నిర్ణయంగా చెబుతున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ తో యుద్దం జరగొచ్చని కథనాలు - ఊహాగానాలు వెలువడుతున్న తరుణంలో చైనా - పాకిస్తాన్‌ తో సరిహద్దుల వెంబడి ఇండియా డిఫెన్స్‌ ను మరింత పటిష్టం చేసేందుకు ఈ ఎస్-400 ఉపయోగపడుతుంది. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణలు సమర్ధవంతంగా ఎదుర్కొనడానికి ఇది మరింతగా ఉపయోగపడుతుందని మిలటరీ అధికారులు చెబుతున్నారు.

సుమారు 400 కిలోమీటర్ల పరిధిలోని శత్రు యుద్ధ విమానాలు - క్షిపణలు - డ్రోన్‌ లనూ ధ్వంసం చేయగలగిన సామర్థ్యం ఈ ఎస్-400 ట్రియంఫ్‌ ఎయిర్ డిపెన్స్ సిస్టమ్‌ కు ఉంది. ఈ క్రమంలో కనీసం ఐదు ఎస్-400 సిస్టమ్స్‌ ల కొనుగోలు చేయాలని భావిస్తున్న భారత్ ఏడాదిగా రష్యాతో చర్చలు జరుపుతోంది. ఏకకాలంలో 36 లక్ష్యాలను ఛేదించగలగడం ఈ డిఫెన్స్ సిస్టమ్ కున్న మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో నాలుగు అడ్మిరల్ గ్రిగోరోవిచ్ - క్లాస్ గైడెడ్-మిసైల్ స్టీల్త్ ఫ్రిగేట్స్‌ కు సంబంధించి మరో కీలక ఒప్పందం కూడా భారత్ - రష్యాల మధ్య కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం కామ్‌ కోవ్ హెలికాప్టర్ల తయారీని ఈ ఇరుదేశాలు సంయుక్తంగా చేపట్టనున్నాయి.

ఇదే క్రమంలో రష్యా అధ్యక్షుడితో సమావేశం అనంతరం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ - సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు జాకోబ్ జుమా - బ్రెజిల్ అధ్యక్షుడు మిచెల్ టెమర్ తో వరుసగా భేటీ అవనున్నారు మోడీ. ఈ విషయంలో చైనా అధ్యక్షుడితో కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ చర్చల్లో ఎన్ ఎస్జీ - పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదం - పాక్‌ - చైనా ఆర్థిక కారిడార్‌ వంటి అంశాలపై చైనా అధ్యక్షుడితో మోడీ చర్చించొచ్చని తెలిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/