Begin typing your search above and press return to search.

ఒక అస్సాం ముస్లిం ఎమ్మెల్యే మాట విన్నారా?

By:  Tupaki Desk   |   2 Jun 2016 7:50 AM GMT
ఒక అస్సాం ముస్లిం ఎమ్మెల్యే మాట విన్నారా?
X
మైనార్టీల పట్ల నిజమైన ప్రేమాభిమానాలు ఉన్న రాజకీయ పార్టీ కానీ.. నేతలు కానీ ఏం చేస్తారు? వారి నిజమైన అభివృద్ధి మీదన దృష్టి సారిస్తారే తప్పించి వారిని ఓటు బ్యాంకుగా అస్సలు చూడరు. అల్పవర్గాలుగా ఉన్న వారి హక్కుల్ని కాపాడటం.. వారి జీవన ప్రమాణస్థాయిని మరింత పెరిగేలా చేయటం లాంటి అంశాలమీదనే ఫోకస్ చేస్తారు. నిజానికి ప్రపంచంలోని పలు దేశాల్లో మైనార్టీలు అంటే ఒక తేలిక భావం. చులకన భావం. కానీ.. అందుకు భిన్నమైన పరిస్థితి భారత్ లో ఉందని చెప్పాలి.

మైనార్టీలను ఓటుబ్యాంకుగా చూడటం.. వారి పట్ల ప్రత్యేక అభిమానం ప్రదర్శించటం అన్ని కూడా గుండుగుత్తుగా పడే వారి ఓట్ల మీదనే తప్ప.. వారి పట్ల నిజమైన ప్రేమాభిమానాలు లేవన్నది నిజం. కానీ.. దీన్ని ఒప్పుకోవటానికి దేశంలో చాలామంది నేతలు సంశయిస్తుంటారు. ఎందుకటే.. వారు ఆ నిజాన్ని ఒప్పుకుంటే వారి అడ్రస్ గల్లంతు కావటం ఖాయం.

దీనికి భిన్నంగా వ్యవహరించారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఒక అస్సాం ప్రజాప్రతినిధి. ముస్లింలకు అత్యంత భద్రత కలిగిన ప్రాంతం భారత్ మాత్రమేనని తేల్చారు. ముస్లింలను ఓటు బ్యాంకుగా చూడని పార్టీలతోనే ముస్లింలకు నిజమైన అభివృద్ధి జరుగుతుందని ఈ అస్సామ్ ఎమ్మెల్యే హక్ లష్కర్ స్పష్టం చేశారు. అస్సాం రాష్ట్రంలోని 86 మంది ఎమ్మెల్యేల్లో ఒకేఒక్క ముస్లిం ఎమ్మెల్యే అయిన లష్కర్ బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఒక ముస్లిం ఎమ్మెల్యే నోటి నుంచి మైనార్టీలకు సంబంధించిన నిజాలు బయటకు రావటం నిజంగా సంతోషకరమైన అంశంగా చెప్పాల్సిందే.