Begin typing your search above and press return to search.

మ‌నం ఇలా చేశాం కాబ‌ట్టే...క‌రోనా వ‌చ్చేసిందా?

By:  Tupaki Desk   |   16 May 2020 3:35 AM GMT
మ‌నం ఇలా చేశాం కాబ‌ట్టే...క‌రోనా వ‌చ్చేసిందా?
X
చైనాలో వెలుగుచూసిన ప్రాణాంతక కరోనా వైరస్‌ యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. చిన్న జ్వరంగా మానవ శరీరంలోకి చేరి క్రమంగా ప్రాణాన్ని కబళిస్తోంది. భార‌త్‌ లోనూ ఈ మ‌హ‌మ్మారి కేసుల సంఖ్య పెరిగిపోతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో మ‌నం అనుస‌రించిన విధానాల్లోని డొల్ల‌త‌నం వెలుగులోకి వ‌చ్చింది. దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌డానికి ముందు కేవ‌లం 19% మంది ప్ర‌యాణికుల‌కే క‌రోనా నిర్దార‌ణ ప‌రీక్ష‌లు చేశార‌ట‌. అప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ తీవ్రంగా ఉన్నా...ఇలా లైట్ తీసుకున్నార‌ని వెల్ల‌డైంది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల‌క‌లం - వివిధ దేశాల్లో లాక్ డౌన్ విధించ‌డం - విమాన ప్ర‌యాణికుల ద్వారా కేసుల న‌మోదు వంటి త‌రుణంలో జ‌న‌వరి 15 నుంచి మార్చి 23వ తేదీల మ‌ధ్య విమాన ప్ర‌యాణికుల‌కు నిర్వ‌హించిన‌ కోవిడ్ ప‌రీక్ష‌ల వివ‌రాలు వెల్ల‌డించాలంటూ స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా సాకేత్ గోఖ‌లే అనే వ్య‌క్తి సంబంధిత అధికారుల‌ను వివ‌రాలు కోరాడు.

దీనికి షాక్‌ కు గుర‌య్యే వివ‌రాలు వ‌చ్చాయి. విమానాల‌ ప్ర‌యాణికుల్లో కేవ‌లం 19% మందికే ప‌రీక్ష‌లు నిర్వ‌హించినట్లు అధికారికంగా వెల్ల‌డించారు. అంతేకాకుండా మార్చి మొద‌టి వారం వ‌ర‌కూ యూర‌ప్ దేశాల నుంచి వ‌చ్చిన ప్ర‌యాణికుల్లో మెజార్టీ ప్యాసింజ‌ర్ల‌కు అస‌లు ప‌రీక్ష‌లే నిర్వ‌హించ‌లేద‌ని ఆర్టీఐ ద్వారా కేంద్రం వెల్ల‌డించింది.

కాగా, ఈ ఆర్టీఐ స‌మాచారం జాతీయ మీడియాలో హైలెట్ అయింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డంలో కేంద్రం ఆదిలోనే చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో విఫలం అయింద‌ని మీడియా ఎత్తి చూపింది. విప‌క్షాలు సైతం దీనిపై ఘాటుగా స్పందించాయి. దీంతో ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం వివ‌ర‌ణ ఇచ్చింది. తాము జ‌న‌వ‌రి నెల మొద‌టి వారం నుంచే కోవిడ్‌-19 నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని పీఎంఓ ఓ ట్వీట్ ద్వారా తెలియ‌జేసింది.

ఇదిలాఉండ‌గా, న్యూఢిల్లీ: లాక్‌ డౌన్‌ కారణంగా పూర్తిగా ఆగిపోయిన విమాన సర్వీసులను త్వరలోనే పునఃప్రారంభిస్తున్నట్లు ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) పేర్కొంది. త్వరలో దేశీయ విమాన సర్వీలు తిరిగి ప్రారంభించే అవకాశం ఉన్నందున ఏఏఐ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రయాణ సమయంలో ప్రయాణికులు ఏఏఐ సూచనలను తప్పకుండా పాటించాలని సూచించింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యసేతు యాప్‌ లో నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. సహచర ప్రయాణికులతో కనీసం నాలుగు ఫీట్లు భౌతిక దూరం పాటించాలని తెలిపింది. ఎయిర్‌ పోర్ట్‌ కు వచ్చేముందు బోర్డింగ్‌ పాస్‌/కార్డు కాపీని ప్రింట్‌ తీసుకొని రావాలని సూచించింది. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని - శానిటైజర్‌ వెంట తీసుకెళ్లాలని సూచించింది. ఎయిర్‌ పోర్టు సిబ్బందికి సహకరించాలని కోరింది.