Begin typing your search above and press return to search.

ఆఫ్గన్ లో భారత్ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ .. ఎలా చేసారంటే ?

By:  Tupaki Desk   |   19 Aug 2021 4:14 AM GMT
ఆఫ్గన్ లో భారత్ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ .. ఎలా చేసారంటే ?
X
ఆఫ్ఘనిస్తాన్‌ ను అతి తక్కువ సమయంలోనే తాలిబన్లు తమ వ్యూహాలతో తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. విదేశీ రాయబారులు ఉండే కాబూల్ రాజధానినీ అతివేగంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ హఠాత్పరిణామానికి సిద్ధమవని దేశాలు తమ దౌత్య అధికారులు, పౌరులను స్వదేశాలకు తీసుకెళ్లడానికి తంటాలు పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో భారత పౌరులు, దౌత్య సిబ్బంది మొత్తం సుమారు 130 మందిని అక్కడి నుంచి విజయవంతం గా తరలించగలిగింది. ఇందుకోసం ఓ సీక్రెట్ ఆపరేషన్‌ ను చేపట్టి అత్యంత చాకచక్యంగా విజయవంతం చేశారు.

కాబూల్ రాజధానిని తాలిబాన్లు ఆదివారం నాడు తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. నగరంలోని హమీద్ కర్జాయ్ ఎయిర్‌ పోర్టు లో గలాట మొదలైంది. ఆప్ఘనిస్తాన్ పౌరులు పోటెత్తి విదేశాలకు వెల్లడానికి తీవ్రప్రయాస పడుతున్నారు. నగరాన్ని తాలిబన్లు చుట్టుముట్టిన ఈ తరుణం లో భారత దౌత్య సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించింది. స్వదేశానికి తిరిగి రావాలనుకున్న భారతీయులందరినీ ఎంబసీ కాంటాక్ట్ అయింది. వారంతా ఎంబసీ మిషన్‌కు ఆగస్టు 16వ తేదీ రాత్రిలోగా చేరుకోవాలని ఆదేశించింది. భారత ఎంబసీ కార్యాలయం నుంచి ఎయిర్‌పోర్టు ఏడు కిలోమీటర్లు.

కానీ, ఈ ఏడు కిలోమీటర్లు తాలిబాన్ల కంటబడకుండా, ఎవరికీ అనుమానం రాకుండా దౌత్యసిబ్బంది, భారత పౌరులు విమానాశ్రయం చేరుకోవాలి. ఈ క్రమంలో ఏ అవాంఛనీయ ఘటనైనా జరగవచ్చు. ప్రభుత్వమే కూలిపోవడంతో సహాయం తీసుకోవడానికి స్థానిక అధికారులెవరూ లేరు. దీంతో సొంతబలాలపైనే ఆధారపడాల్సి వచ్చింది. నమ్మకస్తులైన కొంతమంది మిలిటరీ సహాయాన్ని తీసుకుంది. కనీసం 14 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సంపాదించుకోగలిగింది. ఈ వాహనాలను నాలుగు పైలట్ వాహనాలు వెనుకా ముందు ఉండేలా చూసుకుంది. ఈ పైలట్ వాహనదారులు స్థానిక భాష మాట్లాడగలిగే స్థానికులతో కలిసిపోయే వారిని ఎంచుకుంది. ఎయిర్‌ పోర్టుకు ప్రయాణించే క్రమంలో అవాంతరాలు ఎదురైతే మాట్లాడి పరిష్కరించుకునే లక్ష్యంతో వీరిని నియమించుకుంది.

17వ తేదీ తెల్లవారుజామునే భారత ఎంబసీ అధికారులు, పౌరులు ఎయిర్‌ పోర్టుకు ఆ కాన్వాయ్‌ లో వెళ్లిపోయింది. శాటిలైట్ చిత్రాలు వీటిని ధ్రువపరిచాయి. ఆగస్టు 16వ తేదీ సాయంత్రం ఎంబసీ కాంపౌండ్‌ లో వరుసగా నిలిపిన 14 బుల్లెట్ ప్రూఫ్ కార్లు కనిపించాయి. కానీ, మరుసటి రోజు సూర్యుని వెలుగులో అవి కనిపించలేవు. తాలిబాన్లు హఠాత్తుగా విధించిన రాత్రికర్ఫ్యూ కారణంగా 16వ తేదీ రాత్రి ఎంబసీ అధికారులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నట్టు తెలిసింది.

తాలిబన్లు రాత్రి కర్ఫ్యూ ప్రకటించడంతో భారత అధికారులు అప్పటికప్పుడు ప్లాన్ మార్చేశారు. కాబూల్ విమానాశ్రయానికి బయలుదేరిన భారతీయులందరికీ ఫోన్లు చేశారు. విమానాశ్రయానికి కాకుండా నేరుగా భారత దౌత్య కార్యాలయానికి రావాలని సమాచారమిచ్చారు. అయితే, ఆ మార్గంలో అడుగడగునా మోహరించిన తాలిబన్లు భారతీయులను దౌత్య కార్యాలయానికి అనుమతిస్తారా లేదా అనే టెన్షన్ పట్టుకుంది. అయితే డాక్యుమెంట్స్ చూపించడంతో వారిని అడ్డుకోలేదు. ఆ రాత్రికి ఆ 120 మంది భారతీయులంతా భారత దౌత్య కార్యాలయంలోనే నిద్రించారు.

మరుసటిరోజు తెల్లవారుజామున అందరినీ కాబూల్ విమానాశ్రయానికి తరలించాలనేది ప్లాన్. ఇందుకోసం 120 మందిని రెండు బ్యాచ్‌ లుగా విభజించారు. 14 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఏర్పాటు చేశారు. అప్పటికే హక్కనీ నెట్‌ వర్క్‌ తో పాటు లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాబూల్ నగరంలోకి ప్రవేశించినట్లు తెలిసింది. దీంతో భారత అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. భారత దౌత్య కార్యాలయం నుంచి కాబూల్ విమానాశ్రయం వెళ్లే మార్గంలో మొత్తం 15 చెక్ పోస్టులు ఉన్నాయి. వీటన్నింటినీ దాటుకుని విమానాశ్రయం చేరుకోవడం అతిపెద్ద సవాల్. భారత కాన్వాయ్‌ ఒక్కో చెక్ పాయింట్‌ ను దాటుతూ.. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఢిల్లీలోని అధికారులకు చేరవేసింది. మొత్తానికి కాన్వాయ్ కాబూల్ విమానాశ్రయాన్ని చేరుకోవడంతో మొదటి మిషన్ సక్సెస్ అయింది.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానం(IAF) C-17 .. కాబూల్‌లో ల్యాండ్ అయ్యాక... 120 మంది భారతీయులతో తిరిగి ఢిల్లీ బయలుదేరింది. పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్‌ ఎయిర్‌ స్పేస్‌ నుంచి కాకుండా ఇరాన్ మీదుగా ఢిల్లీకి చేరింది. దీంతో రెండో మిషన్ కూడా విజయవంతమైంది. సరైన సమయంలో,పక్కా ప్లాన్‌తో భారత్‌ ఈ ఆపరేషన్‌ను పూర్తి చేసింది. అయితే ఇప్పటికీ ఇంకా చాలామంది భారతీయులు ఆఫ్గనిస్తాన్‌లోనే చిక్కుకుపోయి ఉన్నట్లు భావిస్తున్నారు. ఎంతమంది ఉండవచ్చనే దానిపై క్లారిటీ లేనప్పటికీ... వారి సంఖ్య వందల్లోనే ఉండవచ్చునని తెలుస్తోంది. వారిని కూడా వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.