Begin typing your search above and press return to search.

భార‌త్‌ బ్ర‌హ్మాండం! ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకాన‌మీ మ‌న‌దేన‌ట‌!

By:  Tupaki Desk   |   26 Dec 2017 11:42 AM GMT
భార‌త్‌ బ్ర‌హ్మాండం!  ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకాన‌మీ మ‌న‌దేన‌ట‌!
X
తెలుగు నేల‌కు చెందిన దివంగ‌త ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు... ఏ స‌మ‌యంలో ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారో గానీ... భార‌త ఎకాన‌మీ అంత‌కంత‌కూ అభివృద్ధి చెందుతూనే దూసుకుపోతోంది. పీవీ హ‌యాంలో ఆర్థిక మంత్రి హోదాలో మ‌రో మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ అమ‌లు చేసిన ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల ఫ‌లితంగా భార‌త్ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం ఎంత‌మాత్రం కాద‌నే చెప్పాలి. అభివృద్ధి చెందుతున్న దేశం హోదా నుంచి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందిన దేశంగా ప‌య‌నం ప్రారంభించేసిన భార‌త్‌... ఎకాన‌మీలో త‌న‌దైన శైలిలో స‌త్తా చాటుతోంది. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ తీరు తెన్నుల‌కు సంబంధించి ఇప్పుడు కొత్త‌గా వెలుగులోకి వ‌చ్చిన ఓ అంశాన్ని ప‌రిశీలిస్తే.... ఈ విష‌యంలో ఎంత‌మాత్రం అతిశ‌యోక్తి కాద‌నే చెప్పాలి.

ఆ అస‌లు సిస‌లు అంశంలోకి వెళితే... వ‌చ్చే ఏడాది(2018) నాటికి భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌... ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల్లో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా అవత‌రించ‌నుంద‌ట‌. ఈ మేర‌కు నేడు విడుద‌లైన‌ *ద సెంట‌ర్ ఫ‌ర్ ఎక‌నామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చీ* నివేదిక ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. అగ్ర‌రాజ్యం అమెరికా క‌రెన్సీ డాల‌ర్ ఆధారంగా తీసుకుంటే... వ‌చ్చే ఏడాది నాటికి భార‌త్ ఎకాన‌మీ... ప్ర‌పంచంలోని ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల్లోకెల్లా ఐదో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా రూపాంత‌రం చెందుతుంద‌ని ఆ నివేదిక వెల్ల‌డించింది. ఇంత‌లా ఎదిగే భార‌త్‌... ఇప్ప‌టిదాకా భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల కంటే పై మెట్టులో ఉన్న బ్రిట‌న్‌, ఫ్రాన్స్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను జాబితాలో కింద‌కు నెట్టేస్తుంద‌ట‌.

అంతేకాకుండా రానున్న కాలంలో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌రింత‌గా బ‌లోపేతం కావ‌డ‌మే కాకుండా... ప్ర‌పంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల్లో మొద‌టి ప‌ది స్థానాల్లో ఉన్న దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను కూడా తీవ్రంగానే ప్ర‌భావితం చేస్తుంద‌ని ఆర్థిక నిపుణులు అంచ‌నాలు వేస్తున్నారు. ఇదిలా ఉంటే... ఇప్ప‌టిదాకా ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఉన్న అమెరికా త‌న స్థానాన్ని కాపాడుకోగా... చైనా అంత‌కంత‌కూ ఎదిగే అవ‌కాశాలు లేక‌పోలేదన్న వాద‌న కూడా వినిపిస్తోంది. 2032లోగా చైనా ఆర్థిక వ్య‌వ‌స్థ అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కింద‌కు నెట్టేసి ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా అవ‌త‌రించ‌నుంద‌ని కూడా ఆర్థిక వేత్త‌లు ప‌క్కా గ‌ణాంకాల‌తో చెబుతున్నారు.