Begin typing your search above and press return to search.

బాబూ కోహ్లీ.. ఏమైంది నీ దూకుడు?

By:  Tupaki Desk   |   16 Aug 2015 10:35 AM GMT
బాబూ కోహ్లీ.. ఏమైంది నీ దూకుడు?
X
‘‘దూకుడుగా ఆడటమే నాకిష్టం. నా కెప్టెన్సీలో కూడా ఆ దూకుడే కనిపిస్తుంది’’ కెప్టెన్ అయిన నాటి నుంచి విరాట్ కోహ్లి ఇవే మాటలు చెబుతున్నాడు. శ్రీలంకతో సిరీస్ కు ముందు కూడా ఇలాగే మాట్లాడాడు. కానీ మైదానంలో మాత్రం ఆ దూకుడు కనిపించలేదు. ఘనవిజయం ఖాయమనుకున్న మ్యాచ్ లో టీమ్ ఇండియా చిత్తయిపోవడానికి కారణం.. మనోళ్ల ఆటలో దూకుడు లేకపోవడమే. అతి జాగ్రత్తకు పోవడం వల్ల అసలుకే మోసం వచ్చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోహ్లి అండ్ కో ఎంచుకున్న వ్యూహం దారుణంగా బెడిసి కొట్టింది.

ముందున్నది కేవలం 176 పరుగుల లక్ష్యం. ఒక్కసారి ఈ మ్యాచ్ లో సెహ్వాగ్ ఉండుంటే ఎలా ఉండేది ఊహించుకోండి. ముందురోజు సాయంత్రం ఉన్న 8 ఓవర్లలోనే ఓ యాభై కరిగించేసేవాడేమో. సెహ్వాగ్ అన్నిసార్లూ విజయవంతమవుతాని చెప్పలేం. కానీ ఇలాంటి సందర్భాల్లో ధనాధన్ ఇన్నింగ్స్ తో ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి నెట్టడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఐతే ప్రస్తుత జట్టులో ధావన్ అలాంటి పాత్ర పోషించగలవాడే. కానీ అతను పరమ జిడ్డు ఆట ఆడాడెందుకో. బహుశా కోహ్లి, టీమ్ మేనేజ్ మెంట్ ఆమేరకు గేమ్ ప్లాన్ రూపొందించిందేమో. మూడో రోజు ఉదయం అతను తొలి పరుగు తీయడానికి 36 బంతులాడాడంటేనే భారత బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. సింగిల్ తీయడానికి కూడా మనోళ్లు ఆపసోపాలు పడిపోయారు. మిగతా బ్యాట్స్ మెన్ కూడా ఇదే తరహాలో ఆడారు. మరీ భయం భయంగా హెరాత్ బౌలింగ్ ను ఆడారు. మనోళ్ల భయం చూడగానే అతడి ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. మామూలుగా హెరాత్ ఓ సాధారణ బౌలర్. కానీ ఆత్మరక్షణలో ఉన్న మన బ్యాట్స్ మెన్ కు శనివారం అతను మురళీధరన్ లాగా కనిపించాడు. అంతే టపటపా వికెట్లు పడిపోయాయి. 192 పరుగుల ఆధిక్యం సాధించిన జట్టు 63 పరుగుల తేడాతో చిత్తయింది. దూకుడు దూకుడు అనే కోహ్లి.. తన జట్టుకు ఇంత ఆత్మరక్షణతో ఆడమని ఎందుకు సలహా ఇచ్చాడో.. అతను సైతం ఎందుకంత అతి జాగ్రత్తతో ఆడాడో మరి