Begin typing your search above and press return to search.

భారత్ 10 వారాలు లాక్ డౌన్ పాటించాల్సిందే!

By:  Tupaki Desk   |   23 April 2020 12:10 PM GMT
భారత్ 10 వారాలు లాక్ డౌన్ పాటించాల్సిందే!
X
కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భారతదేశం మార్చి 22వ తేదీ నుంచి లాక్ డౌన్ ను విధించింది. దీన్ని బట్టి చూస్తే ఇప్ప‌టికే నెల గ‌డిచిపోయింది. మొత్తం ఇప్పటివరకు 32 రోజుల లాక్ డౌన్ పూర్తి అయ్యింది. ప్ర‌స్తుతానికి ప్ర‌భుత్వం చెప్పిన ప్ర‌కారం లాక్ డౌన్ మే 3వ తేదీ వ‌ర‌కూ కొన‌సాగుతుంది. అయితే , రెండోసారి లాక్ డౌన్ ను పొడగిస్తునట్టు ప్రకటించిన తరువాత ఏప్రిల్ 20 తరువాత - లాక్ డౌన్ నుండి కొన్నింటికి మిన‌హాయింపులు ఇచ్చారు. అయితే , మిన‌హాయింపులు ఇప్పుడు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. అదికాక రెడ్ జోన్ల‌లో మ‌రింత క‌ఠినంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు.

ప్ర‌స్తుతానికి మే 3 వ‌ర‌కూ ప‌రిస్థితి ఇలాగే ఉంటుంది అని అందరికి అర్థమైంది. అయితే మే 3 త‌ర్వాత మళ్లీ సాధారణ రోజులు వస్తాయి అని కొందరు అనుకుంటుంటే.. మరికొందరు మాత్రం మే 3 తరువాత కూడా లాక్ డౌన్ నుండి విముక్తి కలుగుతుంది అని అనుకోవడం లేదు. ప్రస్తుతం దీనిపై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. అయితే ఇండియాలో క‌రోనా ప్ర‌భావం గురించి అంచ‌నా వేస్తున్న ఒక హెల్త్ జ‌ర్న‌ల్ వాళ్లు క‌నీసం ప‌ది వారాల పాటు లాక్ డౌన్ ను పాటించ‌డం మేల‌ని ఒక స‌ల‌హా ఇస్తున్నారు. మే 3 త‌ర్వాత లాక్ డౌన్ ను ఆపేసి.. ప్ర‌జ‌ల‌ను య‌థావిధిగా రోడ్ల మీద‌కు వ‌ద‌ల‌డం వ‌ల్ల ఇండియా స‌మ‌స్య నుంచి పూర్తిగా బ‌య‌ట‌ప‌డిన‌ట్టు కాద‌ని వారు అంచ‌నా వేస్తూ ఉన్నారు.

క‌నీసం 10 వారాల లాక్ డౌన్ తో ఇండియా క‌రోనా ను జ‌యించ‌గ‌ల‌ద‌ని వారు విశ్వాసం గా చెబుతున్నారు. అంటే ఇప్పుడు ఐదవ వారం లాక్ డౌన్ న‌డుస్తూ ఉంది. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న మొత్తం ఆరు వారాల‌కు త‌గిన‌ట్టుగా ఉంది. ఈ హెల్త్ జ‌ర్న‌ల్ అభిప్రాయం ప్ర‌కారం... మే 3 త‌ర్వాత మ‌రో నాలుగు వారాల పాటు లాక్ డౌన్ ను పొడగించాల్సి ఉంటుంది. ఈ కరోనాకు సరైన వ్యాక్సిన్ లేకపోవడంతో ..లాక్ డౌన్ ను తొందరపడి ఎత్తివేస్తే ..భారత్ ఇన్ని రోజుల పాటు కస్టపడి కంట్రోల్ లో పెట్టిన కరోనా మళ్లీ విజృంభిస్తుంది అని ఈ జ‌ర్న‌ల్ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇందుకు చైనాను కూడా ఉదాహ‌రిస్తున్నారు నిపుణులు. చైనా వుహాన్ లో మొత్తం 70 రోజుల‌కు పైగా లాక్ డౌన్ ను పాటించింద‌ని, ఆ త‌ర్వాత జ‌న‌జీవ‌నం య‌థాత‌థ స్థితికి వ‌చ్చే ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని, ఇండియాకు కూడా ప‌ది వారాల లాక్ డౌన్ పరిష్కార మార్గ‌మ‌ని ఆ ప‌త్రిక అభిప్రాయ‌ప‌డింది. అయితే , భారత్ లో ఇప్పటివరకు కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయే తప్ప ..తగ్గినట్టు ఇక్కడ కనిపించడం లేదు. దీనితో మే 3 తరువాత కూడా లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం ఉందంటూ ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. చూడాలి మరి కేంద్రం దీని పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ..