Begin typing your search above and press return to search.

చైనాకు భారత్ గట్టి హెచ్చరిక

By:  Tupaki Desk   |   26 Jun 2020 5:00 AM GMT
చైనాకు భారత్ గట్టి హెచ్చరిక
X
ఓవైపు చర్చల పేరుతో సైన్యం వెనక్కి తీసుకునేందుకు అంగీకరిస్తూనే.. మరో వైపు సరిహద్దుల్లో వేలమందిని మోహరిస్తున్న చైనా వైఖరికి నిరసనగా భారత్ గురువారం గట్టి హెచ్చరిక ఇచ్చింది. తూర్పు లఢఖ్ లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించానికి చేసుకున్న అవగాహనను అమలు చేయడంలో విఫలమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తాజాగా భారత్ హెచ్చరించింది. ఇలాగే కొన సాగితే ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధి పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం ఇలానే ఉద్రిక్తతలు చైనా కొనసాగిస్తే ఇరుదేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తాయని పేర్కొంది. మే నెల నుంచి సరిహద్దుల్లో చైనా పెద్ద సంఖ్యలో సైన్యాలు, ఆయుధాలను మోహరిస్తోందని.. ఇది ద్వైపాక్షిక సంబంధాలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది.

గురువారం భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ చైనా దళాలు అన్ని ఒప్పందాలకు తూట్లు పొడుస్తున్నాయని ఆరోపించారు. జూన్ 6న జరిగిన ఇరుదేశాల కమాండర్ల భేటిలో అవగాహనను చైనా ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. చైనా చర్యల వల్ల తాము కూడా భారీగా బలగాలను దించాల్సి వస్తోందన్నారు. సైనిక, దౌత్యమార్గాల్లో చర్చలు కొనసాగుతాయన్నారు.