Begin typing your search above and press return to search.

జూన్ 22 నాటి ఒప్పంద నియమాన్ని పాటించాల్సిందే..చైనాకి భారత్ వార్నింగ్!

By:  Tupaki Desk   |   1 July 2020 11:10 AM GMT
జూన్ 22 నాటి ఒప్పంద నియమాన్ని పాటించాల్సిందే..చైనాకి భారత్ వార్నింగ్!
X
భారత్ -చైనా సరిహద్దుల్లో ఉద్రికత్త పరిస్థితుల నేపథ్యంలో భారత్‌, చైనా సైన్యాలు మంగళవారం మూడో దఫా చర్చలు జరిపాయి. చుషుల్ ‌లోని మోల్డో సరిహద్దు సిబ్బంది సమావేశం (బీపీఎం) పాయింట్ వద్ద తొలిసారి భారత భూభాగంలో జరిగిన ఈ చర్చల్లో 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం పాల్గొన్నది.

చైనా తరఫున దక్షిణ జిన్జియాంగ్ జిల్లా చీఫ్ మేజర్ జనరల్ లియూ లిన్ హాజరయ్యారు. గతంలో జూన్ 6, 22న ఇరు దేశాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలకు వీరే హాజరయ్యారు.తాజాగా భేటీలో.. ఇరు పక్షాల మధ్య ఘర్షణలకు కేంద్రబిందువుగా ఉన్న ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణకు విధివిధానాలను ఖరారు చేయడంపై దృష్టి పెట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, వాస్తవాధీన రేఖ (ఎల్ ‌ఏసీ)కి సంబంధించి చైనా కొత్త వాదనలు వినిపించడంపై ఈ భేటీలో భారత్ ఆందోళన వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది.

గల్వాన్‌ లోయ, పాంగాంగ్‌ సరస్సు, ఇతర ప్రాంతాల్లో యథాపూర్వ స్థితిని పునరుద్ధరించాల్సిందేనని, చైనా బలగాలు వెనక్కి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం. జూన్ 22న జరిగిన చర్చల్లో ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహనకు కట్టుబడి ఉండాలని భారత్ ఉద్ఘాటించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య జరిగిన మూడో దఫా చర్చల వివరాలపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, , సిక్కిమ్, అరుణాచల్ ‌ప్రదేశ్ సహా వాస్తవాధీన రేఖ వెంబడి వివిధ ప్రాంతాల్లో తన సైన్యాలను చైనా మరింత పెంచుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారత్ మాత్రం ఏప్రిల్‌ కు ముందున్న పరిస్థితిని పునరుద్దరించాలని పట్టుబట్టిందని తెలుస్తుంది.

జూన్ 22న జరిగిన చర్చల్లో గాల్వన్ లోయ, గోగ్రా-హాట్‌ స్ప్రింగ్, పాంగాంగ్ సరస్సు వద్ద ఇరు దేశాల సైన్యాలు ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి భౌతికంగా కనీసం 2.5 నుంచి 3 కిలో మీటర్ల మేర వెనక్కువెళ్లాలని నిర్ణయించామని, దీనిని తప్పకుండా అమలు చేయాల్సిందేనని భారత్ బృందం స్పష్టం చేసింది. గాల్వన్ లోయ వద్ద జూన్ 15 చోటుచేసుకున్న వంటి ఘటన పునరావృతం కాకూడదు.. కానీ, క్షేత్ర స్థాయిలో అది ఇంకా జరగ లేదు’ అని పేర్కొన్నాయి.