Begin typing your search above and press return to search.

సెమీఫైనల్ రేసు.. ఊపిరి పీల్చుకున్న భారత్

By:  Tupaki Desk   |   7 July 2019 4:39 AM GMT
సెమీఫైనల్ రేసు.. ఊపిరి పీల్చుకున్న భారత్
X
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ సెమీఫైనల్ కు చేరుకుంది. శనివారం జరిగిన రెండు కీలక మ్యాచ్ లతో సెమీస్ రేసు ఎవరిదో తేలింది. శ్రీలంకను చిత్తు చేసి సగర్వంగా భారత్ గ్రూప్ దశలో అగ్రస్థానం దక్కించుకొని సెమీఫైనల్ రేసులోకి వెళ్లింది. ఇక అనూహ్యంగా సౌతాఫ్రికాతో తలపడ్డ ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఇండియా తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడిదే ఆస్ట్రేలియా పాలిట శాపంగా.. ఇండియా పాలిట వరంగా మారింది.

ఈ సెమీస్ రేసులో టాప్ లో నిలిచిన భారత్ - నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిల్యాండ్ తో తలపడుతుంది. రెండో స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియా - మూడో స్థానంలోని ఆతిథ్య ఇంగ్లండ్ తో తలపడబోతోంది. ఇప్పుడు కంగారులకు కంగారు మొదలు కాగా.. భారత్ మాత్రం ఊపిరి పీల్చుకుంది.

ఈ ప్రపంచకప్ లో వరుసగా 7 విజయాలు సాధించిన భారత్.. ఒక్క ఇంగ్లండ్ చేతిలోనే ఓడిపోయింది. ఇంగ్లండ్ ఈ ప్రపంచకప్ లో వరుసగా 370 పరుగుల దాకా చితకబాదుతూ అత్యధిక రన్ రేట్ తో సెమీస్ రేసులో నిలిచింది. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ వీరబాదుడుకు ప్రపంచకప్ జట్లు అన్నీ కుదేలయ్యాయి. ఇండియా కూడా ఓడిపోయింది. అత్యంత ఫామ్ లో ఉన్న ఇంగ్లండ్ ను వారి సొంత గడ్డపై అదీ సెమీఫైనల్ లో ఎదుర్కోవడం అంతా ఈజీ కాదు. ఆస్ట్రేలియా గనుక సౌతాఫ్రికాపై గెలిస్తే టాప్ లో నిలిచేది. అప్పుడు రెండోస్థానంలో ఉన్న భారత్.. ఇంగ్లండ్ ను ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ ఆస్ట్రేలియా ఓడిపోవడంతో ఇప్పుడు ఇండియాకు ఆయాచిత వరమైంది.

బలమైన ఇంగ్లండ్ ను వారి సొంతగడ్డపై ఆస్ట్రేలియా ఎదుర్కోవాలి. ఇది కత్తిమీద సవాల్. అయితే గ్రూపు దశలో ఇంగ్లండ్ ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా సెమీస్ లో ఎలా పోరాడుతుందో చూడాలి.

ఇక ఇండియా సెమీస్ లో న్యూజిల్యాండ్ తో తలపడుతుంది. మొదట్లో బలంగా కనిపించిన న్యూజిల్యాండ్ చివరికి పాకిస్తాన్ - ఆస్ట్రేలియా - ఇంగ్లండ్ చేతుల్లో ఓడిపోయింది. దీంతో ఇంగ్లండ్ తో పోలిస్తే మనకు న్యూజిల్యాండ్ సెమీస్ లో ప్రత్యర్థి కావడం ఒకింత సులువే. భారత్ ఫైనల్ కు చేరుతుందన్న నమ్మకం బలపడింది. అయితే ప్రపంచకప్ లో ఏ జట్టును తక్కువ అంచనావేసినా దెబ్బైపోతారు. సో వెయిట్ అండ్ సీ.