Begin typing your search above and press return to search.

లండన్‌ లో వెలిగిపోతున్న భారత మార్కెట్

By:  Tupaki Desk   |   26 Oct 2015 4:42 AM GMT
లండన్‌ లో వెలిగిపోతున్న భారత  మార్కెట్
X
లండన్‌ లో మూడో అతిపెద్ద విద్యార్థి మార్కెట్‌ భారత్‌ దేనని సరి కొత్త అధ్యయనంలో తేలింది. 'ద మేయర్‌ ఆఫ్‌ లండన్స్‌' అధికారిక సంస్థ అయిన లండన్‌ అండ్‌ పార్ట్‌ నర్స్‌ దీనిపై ఓ నివేదిక సమర్పించింది. దాని ప్రకారం లండన్‌ లోని వివిధ యూనివర్సిటీల్లో చదువుతున్న విదేశీ విద్యార్థులతో ఆ దేశానికి సుమారు రూ.30 వేల కోట్ల మేర ఆర్థిక లాభం చేకూరినట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఈ విషయంలో భారత్ కంటే ముందు స్థానాల్లో చైనా - అమెరికాలు ఉన్నాయి.

2013-14 కాలానికిగానూ భారత విద్యార్థుల వల్ల రూ.1300 కోట్ల మేరకు ఆదాయం సమకూరింది. అలాగే, చైనా విద్యార్థుల వల్ల రూ.4070 కోట్లు - అమెరికా విద్యార్థుల వల్ల రూ.2170 కోట్లు వచ్చినట్టు ఆ సంస్థ పేర్కొంది. భారత్ విద్యార్థుల నుంచి వచ్చిన రూ.1300 కోట్ల ఆదాయంలో 43 శాతం అంటే సుమారు 560 కోట్లు ట్యూషన్‌ ఫీజుల నిమిత్తం చెల్లించిన వ్యయం కాగా, జీవనం కోసం 56 శాతం (సుమారు రూ.740 కోట్లు) చెల్లించారు. అలాగే, మిగతా ఒక శాతం స్నేహితులు, బంధువుల కోసం వెచ్చించిన మొత్తం.

అమెరికా తర్వాత విద్యా గమ్యస్థానంగా భారతీయులు లండన్‌ ను ఎంచుకోవడం గత కొన్నేళ్లుగా పెరుగుతూ వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా భారతీయుల భగస్వామ్యం పెరుగుతున్నదని ఇటీవల ప్రధాని మోడీ కూడా అమెరికా పర్యటనలో హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కేవలం అమెరికా లండన్ లలో మాత్రమే కాదు. ఇతర దేశాల్లో కూడా నైపుణ్యాలతో నిమిత్తం ఉండే అనేక ఉపాధి రంగాల్లో భారతీయుల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతున్నదని గణాంకాలు చెబుతున్నాయి. ఇది ప్రపపంచవ్యాప్త కెరీర్ ను ఎంచుకునే మన యువతరానికి శుభవార్తే కదా.