Begin typing your search above and press return to search.

నెల రోజుల్లో అమెరికాను దాటేస్తాం

By:  Tupaki Desk   |   18 Nov 2015 7:09 AM GMT
నెల రోజుల్లో అమెరికాను దాటేస్తాం
X
అవును మన దేశం అమెరికాను దాటేయబోతోంది. అందుకు ఇక నెల రోజులే సమయం మిగిలుంది. ఇంతకీ మన దేశం అమెరికాను ఏ విషయంలో దాటిపోనుందంటే.. ఇంటర్నెట్ వినియోగంలో. ఇంటర్నెట్ వినియోగదారులు శరవేగంగా పెరిగిపోతున్న దేశం మనది. ప్రభుత్వాలు కూడా వ్యవస్థను ఇంటర్నెట్ తో అనుసంధానించడానికి ప్రయత్నిస్తుండటం.. ప్రైవేట్ కంపెనీలు వినియోగదారులకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని మరింత చవగ్గా అందుబాటులోకి తెస్తుండటంతో మన దేశంలో ఇంటర్నెట్ వినియోగం చాలా వేగంగా పెరుగుతోంది.

ప్రస్తుతం మన దేశంలో 37.5 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. డిసెంబరు నెలాఖరుకు ఈ సంఖ్య 40 కోట్లు దాటొచ్చని సమాచారం. అదే జరిగితే ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యలో అమెరికా మనకంటే వెనకబడుతుంది. కేవలం ఏడాది వ్యవధిలో మన దేశంలో 10 కోట్ల మంది కొత్తగా ఇంటర్నెట్ వినియోగిస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడు దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 10 కోట్లకు చేరడానికి దాదాపు దశాబ్దం పట్టింది. ఐతే ఇప్పుడు ఇంటర్నెట్ ఒక నిత్యావసరంగా మారిపోవడంతో వినియోగదారుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. చైనా 60 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న భారత్.. ఏడాది ఆఖరుకు అమెరికాను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుతుందని అంచనా.