Begin typing your search above and press return to search.

పాకిస్థాన్ ఇక గోడ అవతలే..

By:  Tupaki Desk   |   8 Oct 2016 10:00 AM GMT
పాకిస్థాన్ ఇక గోడ అవతలే..
X
సీమాంతర ఉగ్రవాదంతో దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇండియా ఇప్పుడు పాక్ తో సంబంధాలు పూర్తిగా క్షీణించిన నేపథ్యంలో ఉగ్రవాదులను దేశంలోకి చొరబడనివ్వకుండా అడ్డకునేందుకు భారీ ప్రణాళిక రచిస్తోంది. పాకిస్థాన్ తో సరిహద్దులో ఏకంగా భారీ కాంక్రీటు గోడ నిర్మించాలని తలపోస్తోంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన కూడా చేశారు. 2018 చివరి నాటికి పాక్ సరిహద్దును పూర్తిగా మూసేస్తామని ప్రకటించారు. పాక్ తో సరిహద్దు పంచుకుంటున్న పంజాబ్ - జమ్మూ కాశ్మీర్ - రాజస్థాన్ - గుజరాత్ లలో దీన్ని నిర్మిస్తారు.

కాగా పాకిస్థాన్‌తో మనకుమొత్తం 3,323 కిలోమీటర్ల పొడవు సరిహద్దు ఉంది. సరిహద్దు పొడవునా నిరంతర సైనిక పహారా ఉంటుంది. చాలావరకు ఇనుప ముళ్ల కంచెను కూడా వేశారు. కంచె వెంబడి కిలోమీటర్ల దూరం వెలుగు ప్రసరించే ఫ్లడ్ లైట్లూ ఏర్పాటు చేశారు. ఇన్ని చేసినా ఉగ్రవాదులు మాత్రం ఎక్కడో ఒక చోట కన్నుగప్పి భారత్ లోకి ప్రవేశిస్తూనే ఉన్నారు. ఈ కారణంగానే ఏకంగా గోడ కట్టేయాలని ఇండియాలో ప్లాన్ చేస్తోంది.

మరోవైపు మొత్తం 3,323 కి.మీ. సరిహద్దులో కంచె నిర్మాణం జరిగింది సుమారు సగభాగమే. పర్వతాలు, నదులు ఉన్న ప్రాంతాల్లో కంచె లేదు. పంజాబ్‌లో 461 కి.మీ... జమ్ము కశ్మీర్‌లో 185 కి.మీ., రాజస్థాన్‌లో 1,048 కి.మీ., గుజరాత్‌లో 217 కి.మీ. కంచె నిర్మించారు. ఆ పొడవునా ఫ్లడ్ లైట్లూ ఉన్నాయి. గుజరాత్ లోని రాణ్ ఆఫ్ కచ్ వద్ద ఎడారి ప్రాంతంలో 93 కి.మీ. మేర కూడా కంచె లేదు. అక్కడ చొరబాట్లు తీవ్రంగా ఉన్నాయి. కాగా ఇలా దేశాల మధ్య గోడలు కట్టుకోవడమన్నది మన దగ్గరే కాదు ఇతర దేశాల్లోనూ ఉంది. మొత్తం 65 దేశాల్లో సరిహద్దు గోడలున్నాయి. పాతికేళ్ల క్రితం బెర్లిన్‌ గోడను బద్దలుకొట్టే సమయానికి 16 దేశాలకే కంచెలు ఉండేవి. ఇప్పుడా సంఖ్య 65కు చేరింది. ఇజ్రాయెల్‌ - పాలస్తీనాల మధ్య 2,500 కిలోమీటర్ల మేర గోడ ఉంది. సిరియా - టర్కీ మధ్య 900 కి.మీ. మేర గోడ ఉంది. అంతెందుకు చివరకు ప్రపంచ వింతల్లో ఒకటైన చైనా గోడ కూడా మంగోలుల దండయాత్రల నుంచి రక్షణ కోసం చైనీయులు నిర్మించుకున్నదే కదా. ఇప్పుడు ఇండియా పాక్ ల మధ్య గోడ కూడా చైనా గోడలా రక్షణ కల్పిస్తుందో లేదో చూడాలి. కారణమేంటంటే... ఉగ్రవాదులు ఒక్క భూసరిహద్దులోంచే కాదు... సముద్రంలోంచి కూడా వస్తున్నారు. ముంబయి దాడులు చేసినప్పుడు అరేబియా సముద్రంలోంచి స్పీడు బోట్లలో వచ్చి మన దేశంలో ప్రవేశించారు. అంతేకాదు... చైనా - నేపాల్ మీదుగా బంగ్లాదేశ్ లోంచి ఇండియాలోకి కూడా పాక్ ఉగ్రవాదులు వస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/