Begin typing your search above and press return to search.

విదేశాల్లోని మనోళ్లను తీసుకొచ్చేస్తున్నారు.. ఖర్చులు ఎవరివంటే?

By:  Tupaki Desk   |   6 May 2020 2:30 AM GMT
విదేశాల్లోని మనోళ్లను తీసుకొచ్చేస్తున్నారు.. ఖర్చులు ఎవరివంటే?
X
విదేశాల్లో చిక్కుకు పోయిన వేలాది మందితో పాటు.. విదేశాల్లో ఉన్న వారు స్వదేశానికి వచ్చేస్తామంటే వారిని తీసుకొచ్చేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దీనికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. మే ఏడు నుంచి విదేశాల్లోని భారతీయులని స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ షురూ కానుంది. దశల వారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

విమానాలు.. నౌకల ద్వారా తరలింపు ఉండనుంది.అయితే.. దీనికోసం పెట్టే ఖర్చును ఎవరికి వారు పెట్టుకోవాల్సి ఉంటుంది. కేంద్రం కేవలం.. వారికి రవాణా సదుపాయాన్ని కల్పించటం మినహా మరే ఆర్థిక బారాన్ని కేంద్రం తీసుకోదని చెబుతున్నారు. ఎవరికి వారు తమ ప్రయాణ ఖర్చుల్ని భరించాల్సి ఉంటుంది. విదేశాల్లో ఉన్న వారిని భారత్ కు తీసుకొచ్చే సమయంలో పక్కాగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అంతేకాదు.. వారు పద్నాలుగు రోజుల పాటు క్వారంటైన్ కేంద్రాల్లో ఉండేందుకు ఓకే చెప్పాల్సి ఉంటుంది.

విదేశాల్లో చిక్కుకు పోయిన భారతీయుల వివరాల్ని ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు సేకరించాయి. ప్రవాస భారతీయుల్ని కూడా అనుమతించనున్నారు. అయితే.. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరు ఆరోగ్య సేతు యాప్ ను తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తమ వివరాల్ని అందులో నమోదు చేయాల్సి ఉంటుంది కూడా.

మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చిన ఆరోగ్యసేతు యాప్ ఇప్పటి వరకూ పది కోట్ల డౌన్ లోడ్లు జరిగినట్లుగా చెబుతున్నారు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాప్ కు అద్భుతమైన స్పందన రావటం గమనార్హం. అయితే.. ఇదంతా ప్రదాని మోడీ మహత్యంగా చెబుతున్నారు. తన ప్రసంగాల్లో ఆరోగ్య సేతు యాప్ గురించి అదే పనిగా ప్రస్తావించటమే రికార్డు స్థాయిలో డౌన్ లోడ్లకు కారణంగా భావిస్తున్నారు.