Begin typing your search above and press return to search.

భారత్ కు రానున్న 15వ శతాబ్దం నాటి సీతారాముల విగ్రహాలు

By:  Tupaki Desk   |   17 Sep 2020 5:32 PM GMT
భారత్ కు రానున్న 15వ శతాబ్దం నాటి సీతారాముల విగ్రహాలు
X
భారత దేశపు సంస్కృతీ సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. మన దేశంలోని శిల్పకళకు విదేశీయులు సైతం మంత్రముగ్దులవుతుంటారు. మన దేశ శిల్పకళకు, శిల్పుల నైపుణ్యానికి ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు నిలువెత్తు తార్కాణాలుగా నిలిచాయి. అయితే, కాలగమనంలో దేవాలయాల్లోని ఎన్నో విలువైన విగ్రహాలు చోరీకి గురై విదేశాలకు తరలివెళ్లాయి. అయితే, వాటి జాడను గుర్తించిన భారత ప్రభుత్వం రాణి-కి వావ్, బుద్ధుడి కాంస్య విగ్ర‌హం, 17వ శ‌తాబ్ధ‌పు కృష్ణుడి విగ్ర‌హం స‌హా విలువైన భారతీయ సాంస్కృతిక సంపద స్వ‌దేశానికి చేర్చ‌డంలో సఫలమైంది. ఈ క్రమంలోనే 15వ శ‌తాబ్ధం నాటి సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతుడుల వారి విగ్ర‌హాల‌ను లండ‌న్ నుంచి తిరిగి తెప్పించేందుకు భార‌త ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంది. 1978లో త‌మిళ‌నాడులోని విజ‌య‌న‌గ‌ర కాలంలో నిర్మించిన ఆల‌యంనాటి విగ్ర‌హాలు త్వరలోనే మన దేశానికి తీసుకువచ్చేందుకు లండ‌న్‌లోని భార‌త హైక‌మిష‌న్ ఇండియా `ప్రైడ్ ప్రాజెక్ట్ `ద్వారా తేనున్నారు.

అపప‌హ‌ర‌ణ‌కు గురైన ఆ విలువైన విగ్రహాలు ప్ర‌స్తుతం లండ‌న్‌లో ఉన్న‌ట్లు గుర్తించిన భారత హై క‌మిష‌న్ 2019 ఆగ‌స్టులోఅక్క‌డి ప్ర‌భుత్వానికి తెలియజేసింది. చోరీకి గురైన రామ‌ల‌క్ష‌ణులు, సీత‌, హ‌నుమంతుని విగ్ర‌హాల‌కు సంబంధించిన ఫోటో ఆర్కైవ్‌ల‌ను ఆధారాలుగా చూపింది. లండ‌న్‌లో ఉన్న ఆ విగ్రహాలు భార‌త సాంస్కృతిక వార‌స‌త్వానికి గుర్తు అని, వాటిని భార‌త్‌కు తిరిగి పంపాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన యూకే ప్ర‌భుత్వం ఆ వ్యవహారంపై ద‌ర్యాప్తు చేసి వాటిని తిరిగి భార‌త్‌కు అందించ‌డానికి సుముఖత వ్యక్తం చేసింది. దీంతో, త్వ‌ర‌లోనే వీటిని త‌మిళ‌నాడుకు తీసుకురానున్నారు. భవిష్యత్తులో ఎఎస్ఐ, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ, స్వ‌తంత్ర ద‌ర్య‌ప్తు సంస్థ‌ల భాగస్వామ్యంతో ఈ తరహా వ్యవహారాల్లో ముందుకు వెళతామని భారత హైకమిషన్, వెల్లడించింది.