Begin typing your search above and press return to search.
నోట్ల రద్దుతో మోడీకి తిరుగులేదట
By: Tupaki Desk | 27 Jan 2017 6:49 AM GMTయావత్ దేశాన్ని తన నిర్ణయంతో షాకిచ్చిన ప్రధాని మోడీ పట్ల ప్రజలు ఎలాంటి భావంతో ఉన్నారు? ఇప్పుడు ఆయన ఇమేజ్ ఎంతలా ఉంది? ఆయన పాలనపైనా.. ఆయన అనుసరిస్తున్న విధానాలపైనా ప్రజల మద్దతు ఎంత? ప్రజల్లో మోడీ ఇమేజ్ ఎంత ఉంది? లాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలతోపాటు.. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి ఎలాంటి ఫలితాలు ఎదురుకానున్నాయన్న విషయం మీద ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే – కార్వీ సంస్థ సర్వే నిర్వహించింది.
ఈ సర్వే వివరాలుఆసక్తికరంగా ఉండటంతో పాటు.. పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చేలా ఉన్నాయని చెప్పకతప్పదు. పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రధాని మోడీ ఇమేజ్ పెరిగిందని.. ఆయన్ను ప్రధానిగా ఓకే చెప్పేస్తున్న వారి సంఖ్య భారీగా ఉన్నట్లుగా తేల్చింది. మోడీ నేతృత్వంలో ఇప్పటికిప్పుడు లోక్ సభకు ఎన్నికలు జరిగితే 360 స్థానాల్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని తేల్చింది.అదే సమయంలో కాంగ్రెస్ కు 60స్థానాలు మాత్రమే వస్తాయని లెక్క కట్టింది.
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో నోట్ల రద్దుకు ముందు తర్వాత.. ఎన్డీయేకు వచ్చే ఓట్ల శాతం రెండుకు పెరిగిందని తేల్చింది. మొత్తంగా 42 శాతం ఓట్లను రాబట్టే వీలుందని చెప్పింది. కాంగ్రెస్ కు 25 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని.. ఇతరులకు 33 శాతం ఓట్లు వచ్చే వీలుందని లెక్క కట్టింది. మోడీని ప్రధానిగా 65 శాతం మంది దేశ ప్రజలు ఆమోదిస్తున్నారని.. పెద్దనోట్ల విషయంలో ప్రతిపక్షాలు ఎంత దుష్ర్పచారం చేసినా ఆయనకున్న ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని సర్వే తేల్చింది.
ఇక.. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించిన అంచనాల్ని వెల్లడించింది. దీని ప్రకారం..
ఉత్తరప్రదేశ్
యూపీలో ఏకైక అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించే వీలుంది. యూపీలో బీజేపీకి 192 నుంచి 196 సీట్లు లభించే వీలుందని.. సమాజ్ వాదీ కాంగ్రెస్ కు 178నుంచి 182సీట్లు దక్కే వీలుందని పేర్కొంది. ఇక.. బహుజనసమాజ్ వాదీ పార్టీకి కేవలం 20 నుంచి 24 సీట్లు మాత్రమే దక్కనున్నట్లు తేల్చింది.
పంజాబ్
వరుస ఓటములతో కిందామీదా పడుతున్న కాంగ్రెస్ కు ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఊరటనిచ్చే వీలుంది. పంజాబ్ లోని మొత్తం 117 స్థానాలకు కాంగ్రెస్ కు 49 నుంచి 51 అసెంబ్లీ స్థానాలు వచ్చే వీలుందని తేల్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో నిలుస్తుందని.. అకాలీ..బీజేపీలకు 28 నుంచి 39 స్థానాలు మాత్రమే లభించే అవకాశం ఉందని అంచనా వేసింది.
గోవా
ఈ రాష్ట్రంలో అధికారపక్షంగా ఉన్న బీజేపీకి 17 నుంచి 19 స్థానాల్ని సొంత చేసుకునే వీలుందన్నది అంచనా. మొత్తం 40 స్థానాలున్న ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కు 11 నుంచి 13 స్థానాలు దక్కే వీలుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి రెండు నుంచి నాలుగు స్థానాల్ని సొంతం చేసుకునే వీలుంది. మహారాష్ట్ర గోమంతక్ పార్టీ నేతృత్వంలోని కూటమికి మూడు నుంచి ఐదు స్థానాలు లభించే వీలుంది.
ఉత్తరాఖండ్
ఈ రాష్ట్రంలో వెలువడే ఫలితాలు బీజేపీకి తిరుగులేని రీతిలో నిలుపుతాయి. మొత్తం 70స్థానాలకు జరిగే ఎన్నికల్లో బీజేపీ 37 నుంచి 39స్థానాల్ని గెలుచుకునే వీలుంది. కాంగ్రెస్ 27 నుంచి 29స్థానాలకు పరిమితం అవుతుందన్న అంచనా వ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/