Begin typing your search above and press return to search.

రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటు.. తొలిసారి సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   26 Aug 2022 2:30 AM GMT
రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటు.. తొలిసారి సంచలన నిర్ణయం
X
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యాకు వ్యతిరేకంగా భారత్ తొలిసారి ఓటు వేసింది. యూఎన్ఎస్.సీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రసంగించడానికి అనుకూలంగా భారత్ నిలిచింది. వాస్తవానికి ఉక్రెయిన్ పై సైనిక చర్య మొదలైన తర్వాత ఈ అంశంపై భద్రతా మండలిలో జరిగే చర్చలు, ఓటింగ్ లో భారత్ తటస్థ వైఖరి అవలంభిస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటువేయడం ఇదే తొలిసారి. అటు చైనా మాత్రం ఓటింగ్ కు దూరంగా ఉంది.

ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలుపెట్టి ఆరునెలలు పూర్తయ్యింది. ఇదే సమయంలో ఉక్రెయిన్ 31వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా యుద్ధం పరిస్థితులను సమీక్షించేందుకు ఐరాస భద్రతా మండలి సమావేశమైంది. ఇందులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించడాన్ని రష్యా వ్యతిరేకించింది. ప్రోసీజరల్ ఓటింగ్ ను కోరింది.

దీంతో 15 దేశాలు కలిగిన భద్రతా మండలిలో 13 దేశాలు జెలెన్ స్కీ ప్రసంగానికి అనుకూలంగా ఓటు వేశాయి. కేవలం రష్యా మాత్రమే దీన్ని వ్యతిరేకించింది. చైనా ఈ ఓటింగ్ కు దూరంగా ఉంది. దీంతో 13 సభ్యదేశాల మద్దతుతో జెలెన్ స్కీ ప్రసంగించారు.

ఉక్రెయిన్ పై ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రష్యా యుద్ధం ప్రకటించింది. దీన్ని అమెరికా, యూరప్ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి.రష్యాపై కఠిన ఆంక్షలు విధించాయి. రష్యాను తీవ్రంగా విమర్శించాయి. భారత్ మాత్రం చర్చలు, సంప్రదింపుల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని ఇరుదేశాలకు సూచిస్తోంది.

భద్రతామండలిలో గతంలో జరిగిన ఓటింగ్ లకు దూరంగా ఉంటూ తటస్థవైఖరిని భారత్ కొనసాగించింది. కానీ తాజాగా జెలెన్ స్కీ ప్రసంగం విషయంలో జరిగిన ప్రోసీజరల్ ఓటింగ్ లో మాత్రం రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసింది.

ప్రస్తుతం ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్ పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ తో ముగియనుంది.