Begin typing your search above and press return to search.

చైనాతో పోరు : భారత్ కి మద్దతుగా అమెరికా బలగాలు !

By:  Tupaki Desk   |   26 Jun 2020 5:45 AM GMT
చైనాతో పోరు : భారత్ కి మద్దతుగా అమెరికా బలగాలు !
X
చైనా ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ ‌కు అండగా బలగాలు పంపుతామని అగ్రరాజ్యం అమెరికా కీలక ప్రకటన చేసింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో వెల్లడించారు. జర్మనీలో ఉన్న అమెరికా బలగాలను ఎందుకు తగ్గిస్తున్నారన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. భారత్‌, దక్షిణాసియాకు చైనా ముప్పుగా పరిణమించడమే కారణమని తెలిపారు.

చైనా చర్యలు చూస్తుంటే భారత్‌ ను బెదిరిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయన్న ఆయన వియత్నాం, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్‌ దేశాలకూ చైనా తీరు ముప్పుగా పరిణమించిందని అన్నారు. దక్షిణ చైనా సముద్రంలో కూడా సవాళ్లు ఎదురవుతున్నాయని, ఈ సవాళ్లన్నింటినీ ఎదుర్కోవడానికి ప్రస్తుతం అమెరికా బలగాలను సరైన రీతిలో మోహరిస్తామని, చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి బదులివ్వడానికి తాము అవసరమైన రీతిలో బలగాలను మోహరిస్తామని స్పష్టం చేశారు పాంపియో.

అసలు ఈ వివాదం స్వభావం ఏంటి? బెదిరింపులు, ముప్పు ఏ మేరకు ఉన్నాయి? వాటిని ఎదుర్కొనేందుకు మన వనరులను ఎలా కేటాయించాలి? అన్న విషయాలపై ఎప్పటికప్పుడు పునస్సమీక్షించుకుంటున్నామని పాంపియో తెలిపారు. నిఘా, ఎయిర్స్‌ఫోర్స్‌, తీరరక్షక దళాలు ఇలా ఏ వనరులనైనా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకొని ప్రపంచ వ్యాప్తంగా అవసరమైన ప్రాంతాలకు కేటాయించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. అందులో భాగంగానే అమెరికా అధ్యక్షుడు జర్మనీలో బలగాలను ఉంచారని అన్నారు. అలాగే చైనా నుంచి ముప్పు ఉన్న భారత్‌, వియత్నాం, మలేసియా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌, దక్షిణచైనా సముద్రం వంటి చోట్లకు బలగాలను పంపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.