Begin typing your search above and press return to search.

సఫారీలకు చుక్కలు చూపిస్తున్న స్పిన్నర్లు

By:  Tupaki Desk   |   14 Nov 2015 2:27 PM GMT
సఫారీలకు చుక్కలు చూపిస్తున్న స్పిన్నర్లు
X
భారత్ టూర్ కు వచ్చిన సఫారీలు టీమిండియాకు చుక్కలు చూపించటమే కాదు.. ఎందుకొచ్చి పడిందిరా బాబు ఈ ట్రిఫ్ అన్నట్లు సాగింది. టీ20.. వన్డే సిరీస్ ల్లో భారత్ కు పరాజయ భారం మిగిల్చిన దక్షిణాఫ్రికా జట్టుకు.. టెస్ట్ సిరీస్ మొదలయ్యేసరికి చేతులెత్తేస్తున్న పరిస్థితి.

మొన్నా మధ్య మొహాలీలో స్పిన్ దెబ్బకు చేతులెత్తేసిన సఫారీలు.. తాజాగా బెంగళూరులో మొదలైన రెండో టెస్ట్ మ్యాచ్ లోనే అలాంటి పరిస్థితి ఎదురైంది. తొలి టెస్ట్ మిగిల్చిన పరాజయాన్ని బెంగళూరు టెస్ట్ మ్యాచ్ తో అధిగమిద్దామని భావించిన సౌతాఫ్రికాకు.. టీమిండియా స్పిన్నర్లు ఒక పట్టాన వంట బట్టలేదు. కేవలం.. 214 పరుగులకే అలౌట్ అయిన దుస్థితి.

తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీల బ్యాటింగ్ లైన్ మొత్తాన్ని స్పిన్నర్లు చెల్లాచెదరు చేసేశారు. బ్రహ్మాండమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న సఫారీలకు చిన్నస్వామి స్టేడియం కూడా అచ్చి రాలేదు. మిగిలిన బ్యాట్స్ మెన్ల పరిస్థితిని పక్కన పెట్టి.. టెస్టుల్లో ఇరగదీస్తాడని పేరున్నఆమ్లా సైతం బ్యాట్ ఝుళిపించేందుకు తడబడటం విశేషం.

సఫారీల జట్టులో ఒక్క డివిలీయర్స్ చేసిన 85 పరుగులు తప్పించి.. మరే బ్యాట్స్ మెన్ కూడా తమ ప్రభావం చూపించలేకపోయారు. డివిలీయర్స్ తర్వాత చెప్పుకోదగ్గ స్కోర్ అంటే.. ఎల్గర్ చేసి 38 పరుగులు మాత్రమే. సఫారీల బ్యాటింగ్ లైన్ ను చెల్లాచెదురు చేయటంలో అశ్విన్.. జడేజాలు నాలుగు వికెట్ల చొప్పున తీయగా.. ఆరోన్ ఒక వికెట్ తో సఫారీల ఆటను సమాప్తం చేశాడు. నిజానికి ఒక దశలో సఫారీలు 200 మార్క్ ను కూడా దాటటం కష్టంగా అనిపించినప్పటికీ 214 పరుగులు చేయగలిగారు.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా తాను ఆడిన 22 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 80 పరుగులు చేశారు. ఓపెనర్లుగా వచ్చిన శిఖర్ ధవన్ 45 (ఇందులో 7 ఫోర్లు ఉన్నాయి) పరుగులు.. మురళీ విజయ్ 28 పరుగులు చేశారు. మొదటి రోజు టీమిండియా ఆటతీరు చూస్తే.. తొలి ఇన్నింగ్స్ లో భారీస్కోర్ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ఇందుకు ఆదివారం ఆట కీలకం కానుంది.