Begin typing your search above and press return to search.

ఇండియ‌న్ వారెన్ బ‌ఫెట్ ఇక‌లేరు!

By:  Tupaki Desk   |   14 Aug 2022 4:20 AM GMT
ఇండియ‌న్ వారెన్ బ‌ఫెట్ ఇక‌లేరు!
X
ఇండియ‌న్ వారెన్ బ‌ఫెట్‌గా పేరుగాంచిన ప్ర‌ముఖ ఇన్వెస్ట‌ర్ రాకేష్ జున్‌జున్‌వాలా (62) ఇక‌లేరు. ఆగ‌స్టు 14 ఆదివారం తెల్ల‌వారుజామున ఆయ‌న క‌న్నుమూశారు. అవ‌య‌వాలు వైఫ‌ల్యం చెంద‌డం వ‌ల్లే ఆయ‌న క‌న్నుమూశార‌ని తెలుస్తోంది. ఆగ‌స్టు 13న ఆయ‌న ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్ప‌త్రిలో చేరార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఆరోగ్యం క్షీణించ‌డం, అవ‌య‌వాల వైఫ‌ల్యంతో క‌న్నుమూశార‌ని వైద్యులు తెలిపారు.

త‌న తండ్రి ద‌గ్గ‌ర అప్పుగా తీసుకున్న రూ.5వేల పెట్టుబ‌డితో షేర్లు కొన‌డం ప్రారంభించిన రాకేష్ జున్‌జున్‌వాలా వేల కోట్ల రూపాయ‌లు ఆర్జించారు. ఇండియ‌న్ వారెన్ బ‌ఫెట్‌గా వినుతికెక్కారు.

సంబంధిత రంగాల‌ను లోతుగా అధ్య‌య‌నం చేయ‌డం, భ‌విష్య‌త్తులో పెర‌గ‌డానికి ఆస్కార‌మున్న కంపెనీల షేర్లు కొన‌డం, ప్ర‌స్తుతం ఒడిదొడుకులు ఎదురైన‌ప్ప‌టికీ భ‌విష్య‌త్తులో ఆ రంగాల వృద్ధి ఉంటుంద‌ని విశ్వ‌సించ‌డం త‌న విజ‌యానికి కార‌ణాలు అని ఆయ‌న ప‌లు సంద‌ర్భాల్లో చెప్ప‌డం గ‌మ‌నార్హం.

సాధార‌ణ ఇన్వెస్ట‌ర్లు రాకేష్ జున్‌జున్‌వాలాను ఆద‌ర్శంగా భావిస్తారు. ఆయ‌న ఏ కంపెనీ షేర్లు కొంటే ఆ కంపెనీల్లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. రాకేష్ జున్‌జున్‌వాలా ఏ కంపెనీల్లో అయితే షేర్లు పెట్టారో ఆ కంపెనీలు స్టాక్ మార్కెట్ లో భారీ వృద్ధి రేటును న‌మోదు చేస్తాయి. అంత‌గా ఆయ‌న సాధార‌ణ ఇన్వెస్ట‌ర్ల విశ్వ‌సాన్ని చూర‌గొన్నారు.

ఒక సాధార‌ణ కుటుంబం నుంచి వ‌చ్చిన రాకేష్ జున్‌జున్‌వాలా కేవ‌లం త‌న తెలివితేట‌లు, స్టాక్ మార్కెట్ మీద ఉన్న ఆస‌క్తితో అతి స్వ‌ల్ప‌కాలంలో బిలియ‌నీర్ గా ఎదిగారు. భార‌త‌దేశంలో అత్యంత ధ‌న‌వంతుల్లో ఒక‌రిగానూ రాకేష్ ఉన్నారు. రాకేష్ జున్‌జున్‌వాలా ఆకస్మిక మృతితో పెట్టుబడిదారుల సంఘం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఆయ‌న‌కు భార్య రేఖా జున్‌జున్‌వాలా, ముగ్గురు పిల్లలు ఉన్నారు.