Begin typing your search above and press return to search.

ఇండియాను సిరియాను చేయొద్దు..అయోధ్యలో మసీదు వద్దు

By:  Tupaki Desk   |   5 March 2018 5:11 PM GMT
ఇండియాను సిరియాను చేయొద్దు..అయోధ్యలో మసీదు వద్దు
X
అయోధ్య వివాదం భార‌త్‌ ను మ‌రో సిరియాను చేస్తుందేమోనని ఆధ్యాత్మిక గురువు - ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ సంచలన వ్యాఖ్య చేశారు. అయోధ్య వివాదంపై ముస్లింలు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను నిరూపించాల‌న్నారు. అయోధ్య ముస్లింల‌కు న‌మ్మ‌క‌మైన ప్ర‌దేశం కాద‌ని - వివాద ప్ర‌దేశంలో దేవుడిని కొల‌వ‌డాన్ని ఇస్లాం అనుమ‌తించ‌ద‌న్నారు. సిరియా విషయంలో అమెరికా - ర‌ష్యా దేశాలు క‌లుగ‌జేసుకున్న‌ట్లే.. అయోధ్య‌లో రామాల‌యం నిర్మాణం విష‌యంలోనూ ఇత‌రులు క‌ల్పించుకుంటున్నార‌ని, ఈ ప‌రిణామం ఎంత వ‌ర‌కు దారితీస్తుందో అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

సిరియా నరమేధం నుంచి ముస్లింలు కొన్ని విషయాలు నేర్చుకుని - అయోధ్య వివాదంపై ఆశలు వదులుకుని వెనక్కి తగ్గడమే ఉత్తమమని అభిప్రాయపడ్డారు. జాతీయ మీడియా ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశంకర్ ఈ విషయాలు ప్రస్తావించారు. అయోధ్య అనేది ముస్లింలకు సంబంధించిన అంశం, ప్రాంతం కాదని వారు గుర్తించాలన్నారు. శ్రీరాముడిని అయోధ్యలో కాకుండా వేరే ప్రాంతంలో జన్మించేలా చేయడం అసాధ్యమని.. ఇలాంటి వివాదాస్పద ప్రాంతాన్ని ఇస్లాం ఎప్పటికీ కోరుకోదని చెప్పారు. హిందువులు, ముస్లింల పరస్పర ఆమోదంతో రామమందిర నిర్మాణం జరగాలని కోరుకుంటున్నామని తెలిపారు. ముస్లింలకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని, వారు ఆ స్థలంలో మసీదు నిర్మించుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు. వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మించేందుకు ముస్లింలు పూర్తి మద్ధతు తెలపాలని పిలుపునిచ్చారు.

రామ మందిరం-బాబ్రీ మసీదు కూల్చిన ప్రాంతంలో అన్ని మతాల వారికి ఉపయోగపడే ఆసుపత్రి, లేదా ఇతరత్రా ఏదైనా నిర్మించాలని సలహా ఇచ్చారు. కొందరు తనపై దుష్ప్రచారం చేస్తూ వివాదాన్ని పెంచేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య అంశంలో ప్రతి ఒక్కరూ కోర్టు తీర్పును అంగీకరించే పరిస్థితుల్లో లేరన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఐఎంపీఎల్‌ బీ) బహిష్కృత సభ్యుడు సయ్యద్ సల్మాన్ హుస్సేన్ నద్వీని తాను ప్రలోభపెట్టలేదని వెల్లడించారు. షరియా చట్టం ప్రకారం మసీదును వేరే చోటుకి తరలించడం సాధ్యమేనని నద్వీ గతంలో ప్రకటన చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే.