Begin typing your search above and press return to search.

అమెరికా చెప్పిన‌ట్లు మ‌నం బుద్దిగా వినాల్సిందేనా?

By:  Tupaki Desk   |   24 April 2019 5:28 AM GMT
అమెరికా చెప్పిన‌ట్లు మ‌నం బుద్దిగా వినాల్సిందేనా?
X
మీ ఇంటికి అవ‌స‌ర‌మైన స‌రుకులు మీకు న‌చ్చిన షాపులో కొనుక్కోవ‌టం కామ‌న్. కానీ.. ప్ర‌భుత్వం ఫ‌లానా షాపులోనే కొనాలి.. మీకు న‌చ్చిన షాపులో కొనే వీలు లేదంటే ఎలా ఉంటుంది? కాలిపోద్ది. సొంత ప్ర‌భుత్వం ప‌రిమితులు పెడితేనే.. కాలిపోతే.. మ‌న దేశం చ‌మురు ఎవ‌రి ద‌గ్గ‌ర కొనాల‌న్న విష‌యం మీద అమెరికా డిసైడ్ చేయ‌టం ఏమిటి? మీరు ఫ‌లానా వారి ద‌గ్గ‌ర ముడి చ‌మురు కొన‌ద్ద‌ని చెప్ప‌టం దేనికి నిద‌ర్శ‌నం?

పేరుకు త‌గ్గ‌ట్లే పెద్ద‌న్న‌గా వ్య‌వ‌హ‌రించే అమెరికా.. త‌న రూపాన్ని మ‌రోసారి ప్ర‌ద‌ర్శించింది. ఇరాన్ తో త‌న‌కున్న పంచాయితీ నేప‌థ్యంలో ఆ దేశం నుంచి ఎవ‌రూ ముడిచ‌మురు దిగుమతి చేసుకోవ‌ద్ద‌న్న మాట‌ను చెప్ప‌ట‌మే కాదు..భార‌త్ లాంటి దేశాల‌కు గ‌ట్టిగా చెప్ప‌టం గ‌మ‌నార్హం. అమెరికా మాట‌కు త‌గ్గ‌ట్లే భార‌త స‌ర్కారు సైతం.. ఇరాన్ ద‌గ్గ‌ర నుంచి కాకుండా.. వేరే వారి ద‌గ్గ‌రి నుంచి ముడిచ‌మురు కొంటే మ‌న చేతి చ‌మురు వ‌ద‌ల‌టం ఖాయం. ఎందుకంటే.. మిగిలిన దేశాల‌తో పోలిస్తే.. ఇరాన్ నుంచి మ‌నం కొనే చ‌మురు ధ‌ర త‌క్కువే కాదు.. చాలానే సౌక‌ర్యాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో అలాంటివేమీ ఉండ‌దు. దీని ప్ర‌భావం మ‌న‌మీద నేరుగా ప‌డుతుంది. అమెరికాకు ఆగ్ర‌హం రాకూడ‌ద‌న్న ఉద్దేశంతో భార‌త స‌ర్కారు త‌గ్గి నిర్ణ‌యం తీసుకోవటం దేశ ప్ర‌యోజ‌నాల‌కు భంగం వాటిల్లేలా ఉండ‌టాన్ని ప్ర‌స్తావించాల్సిన అవ‌స‌రం ఉంది.

అవ‌స‌ర‌మైతే.. మీ మాట‌కు త‌గ్గ‌ట్లు వేరే వారి ద‌గ్గ‌ర కొనాలంటే.. మాకు అద‌నంగా ప‌డే భార‌మింత‌? మీరు ఓకే చేస్తారా? అంటూ అమెరికాను అడ‌గాల్సిన అవ‌స‌రం లేదా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఇరాన్ ద‌గ్గ‌ర మ‌నం కొనే ముడిచ‌మురుకు ఆ దేశం చాలానే ఆఫ‌ర్లు ఇస్తోంది. ఇరాన్ నుంచి కొనుగోలు చేసే ముడిచ‌మురుకు ఇవ్వాల్సిన మొత్తాన్ని డాల‌ర్ల రూపంలో కాకుండా రూపాయిల్లో చెల్లించే వెసులుబాటు.. రెండు నెల‌ల పాటు అప్పు ఇవ్వ‌టం.. ఉచితంగా డోర్ డెలివ‌రీని అందిస్తోంది. ఇత‌ర దేశాల ద‌గ్గ‌ర ముడిచ‌మురు కొంటే ఇలాంటివేమీ ఉండ‌దు. అదే జ‌రిగితే.. మ‌న మీద పెరిగే భారం అంతిమంగా ప్ర‌జ‌ల మీద ప‌డుతుంది.

అంతేనా.. ఇరాన్ తో మ‌న‌కున్న డీల్స్ నేప‌థ్యంలో చాబ‌హార్ పోర్టు కోసం భార‌త్ రూ.1600 కోట్లు పెట్టుబ‌డిగా పెడుతోంది. ఇరాన్ తో వ్యాపారం ఆపేస్తే.. మ‌నం చేసే ఖ‌ర్చుకు ఎలాంటి ప్ర‌యోజ‌నం లేకపోగా.. భారీగా న‌ష్ట‌పోయే ప‌రిస్థితి. పెద్ద‌న్నతో స్నేహం చెడిపోకూడ‌దు స‌రే.. అలా అని అందుకు భారీ ఖ‌ర్చు భ‌రించాల్సి రావ‌టం తెలివైన పనేనంటారా?