Begin typing your search above and press return to search.

విజయదశమి రోజున విజయదుందుభి

By:  Tupaki Desk   |   23 Oct 2015 4:22 AM GMT
విజయదశమి రోజున విజయదుందుభి
X
సఫారీల చేతిలో పరాజయం మీద పరాజయంతో కుంగిపోతున్న టీమిండియా చెన్నైలో చెలరేగిపోయింది. విజయదశమి రోజున విజయదుందుభి మోగించి భారత క్రికెట్ అభిమానులకు పండగ బహుమతి ఇచ్చారు. ఉదయం నుంచి పండగ సంబరాల్లో మునిగిపోయిన వారికి.. రాత్రికి స్వీట్ గిఫ్ట్ ఇచ్చేసి సంతోషపెట్టేశారు.

చెన్నై చిదంబరం స్టేడియంలో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా చెలరేగిపోవటం.. సఫారీలు చేతులెత్తేయటంతో ఐదు వన్డేల సిరీస్ 2-2గా సమమైంది. ముంబయిలో సిరీస్ విజేతను డిసైడ్ చేసే నిర్ణయాత్మక మ్యాచ్ గా మారింది.

ఇక.. టీమిండియా గెలుపులో విరాట్ కోహ్లీ కీలక భూమిక పోషించారని చెప్పాలి. 140 బంతుల్లో ఏకంగా 138 పరుగులు చేయటంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 299 పరుగులు చేయగలిగింది. ఐదు సిక్సర్లు.. ఆరు ఫోర్లతో స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించిన కోహ్లీ పుణ్యమా అనే ఈ భారీ స్కోర్ టీమిండియా నమోదు చేయగలిగింది.

300 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలను భువనేశ్వర్.. హర్భజన్ లు చావు దెబ్బ తీశారు. భువనేశ్వర్ మూడు వికెట్లు తీయగా.. హర్భజన్ రెండు వికెట్లు తీశారు. ఇక.. మెహిత్.. అక్షర్.. అమిత్ మిశ్రా ఒక్కొక్క వికెట్ చొప్పున తీశారు. ఓ పక్క సఫారీల వికెట్లు పడిపోతున్నా డివిలియర్స్ ఒంటరి పోరు చేశారు.

అతగాడు 107 బంతుల్లో 112 పరుగులు చేసినప్పటికీ.. అతగాడికి అండగా నిలిచిన బ్యాట్స్ మెన్ లేరని చెప్పాలి. భారత విజయానికి ప్రమాదకారిగా మారిన డివిలియర్స్ ను సరైన సమయంలో 233 పరుగుల వద్ద భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన బంతితో డివిలియర్స్ ను ఔట్ చేయటంతో టీమిండియా గెలుపు ఖరారైంది. 300 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు మాత్రమే చేయటంతో.. టీమిండియా 35 పరుగుల తేడాతో విజయబావుటా ఎగురువేసింది.

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా శతకంతో చితక్కొట్టేసిన కోహ్లీ నిలిచారు. సిరీస్ విజేతను డిసైడ్ చేసే నిర్ణయాత్మక మ్యాచ్ ఈ నెల 25 (ఆదివారం) ముంబయిలో జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన వారే సిరీస్ విజేతగా అవతరించనున్నారు. తాజా విజయంతో రెట్టించిన ఉత్సాహంతో సఫారీలకు టీమిండియా షాకిస్తుందా? లేదా? అన్నది తేలాలంటే మరో మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే.