Begin typing your search above and press return to search.

రంగంలోకి హెలికాఫ్టర్లు.. యుద్ధ విమానాలు

By:  Tupaki Desk   |   22 Nov 2016 3:22 AM GMT
రంగంలోకి హెలికాఫ్టర్లు.. యుద్ధ విమానాలు
X
నోట్ల రద్దు నిర్ణయం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై ఇన్నాళ్లకు కేంద్రం సీరియస్ గా దృష్టి సారించిందన్న భావన కలిగే నిర్ణయం ఒకటి తీసుకుంది. పెద్దనోట్ల రద్దుతో.. చిన్న నోట్ల కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కరెన్సీ కోసం బ్యాంకుల వద్ద.. ఏటీఎం సెంటర్ల వద్దా ప్రజలు బారులు తీరి.. గంటల కొద్దీ వెయిట్ చేస్తున్న పరిస్థితి. బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న వారు.. వారానికి విత్ డ్రా చేసుకునే నగదు పరిమితి రూ.24వేలు ఉన్నట్లు కేంద్రం ప్రకటించినా.. బ్యాంకుల వద్ద క్యాష్ లేని నేపథ్యంలో రూ.2 వేల నుంచి రూ.3వేల వరకు మాత్రమే బ్యాంకులు ఇస్తున్నాయి.

ఈ చిన్ని మొత్తం కోసం గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి పరిస్థితి. రద్దు నిర్ణయం తీసుకొని దాదాపు 14 రోజులు గడిచిపోతున్నా.. నేటికి సమస్య తగ్గక పోగా తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న పరిస్థితి. ఆర్ బీఐ నుంచి రావాల్సిన కరెన్సీ ఆలస్యం కావటం.. డిమాండ్ కు తగినంతగా డబ్బులు ఆర్ బీఐ వద్ద లేవన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో రాజకీయ పక్షాలు విమర్శల్ని తీవ్రతరం చేశాయి.

ఈ నేపథ్యంలో కేంద్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కరెన్సీ నోట్ల ప్రింటింగ్ కేంద్రాల నుంచి బ్యాంకులకు పంపిణీ చేసే సమయాన్ని 21 రోజుల నుంచి 6 రోజులకు తగ్గించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం.. కరెన్సీ రవాణా కోసం అందుబాటులో ఉన్న అన్నీ రవాణ సౌకర్యాల్ని ఉపయోగించాలని నిర్ణయించింది. హెలికాఫ్టర్లతో పాటు.. సైనిక విమానాల్ని కూడా వినియోగిస్తూ నోట్ల కొరతకు చెక్ చెప్పాలని భావిస్తోంది. మరో వారం రోజుల్లో పరిస్థితి సాధారణ స్థితికి చేరుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే పరిస్థితి గతంతో పోలిస్తే కాస్త మెరుగైందని చెబుతున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అలాంటి పరిస్థితి లేదని చెబుతున్నారు. కానీ.. వాస్తవ పరిస్థితులు చూస్తుంటే అందుకు భిన్నంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరెన్సీ రవాణాలో తీసుకున్న మార్పుల కారణంగా కొరతకు కాస్తంత బ్రేక్ పడే వీలుందని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/