Begin typing your search above and press return to search.

చైనాను వెనక్కి నెట్టి భారత వైమానిక దళం మరో రికార్డ్

By:  Tupaki Desk   |   10 Jun 2022 1:30 AM GMT
చైనాను వెనక్కి నెట్టి భారత వైమానిక దళం మరో రికార్డ్
X
ఈ ప్రపంచంలో అందరూ మనలాగా ఉండరు. పైగా మన పక్కనే ఉగ్రవాద భూతంతో ఉన్న పాకిస్తాన్ ఉంది. దానిపక్కనే తాలిబన్ల రాజ్యం అప్ఘనిస్తాన్ ఉంది. ఇక ఇటు పక్క ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా విర్రవీగుతున్న చైనా కాచుకు కూర్చుంది. అందుకే మన రక్షణ అనేది కీలక బాధ్యత. ఈ రక్షణ కోసం మన త్రివిధ దళాలు కీలకపాత్ర పోషిస్తాయి.

ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఏ యుద్ధమైనా సరే వైమానిక దళాలు కీలక పాత్ర పోషిస్తాయి. వేగంగా.. సులువుగా చొచ్చుకుపోయి శత్రువును తుదముట్టించడం ఎయిర్ ఫోర్స్ కే సాధ్యం. మరి ఈ విషయంలో మన భారత వైమానిక దళం మరో రికార్డ్ సృష్టించింది.

ప్రపంచంలోని ఉత్తమ ఎయిర్ ఫోర్స్ లలో దేశాల వారీగా చూస్తే మూడో స్థానంలో.. వైమానిక దళాల వారీగా చూస్తే ఆరోస్థానంలో నిలిచింది. మొత్తంగా చైనా కన్నా మన ఎయిర్ ఫోర్స్ పైన ఉండడం గమనార్హం.

వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్స్ మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ (డ్బ్యూడీఎంఎంఏ) సంస్థ క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఈ ర్యాంకులను ఇచ్చింది. ఎయిర్ ఫోర్స్ తోపాటు ఆర్మీ, నేవీ, దళాలకు అనుబంధంగా ప్రత్యేకంగా వైమానిక దళ విభాగాలు ఉంటాయి. ఇలాంటి వాటన్నింటినీ కూడా ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకొని అధ్యయనం చేసింది.

ఇందులో సంఖ్యాబలం.. అత్యాధునికత రెండింటిలోనూ అమెరికా దళాలు ప్రపంచంలోనే టాప్ లో నిలిచాయి. తొలి రెండు స్థానాల్లో యూఎస్ ఎయిర్ ఫోర్స్ , యూఎస్ నేవి నిలవగా.. మూడోస్థానంలో రష్యన్ ఎయిర్ ఫోర్స్ నిలిచింది. తిరిగి నాలుగు, ఐదో స్థానాల్లో యూఎస్ ఆర్మీ ఏవియేషన్, యూఎస్ మెరైన్ కార్ప్స్ నిలిచాయి. ఆరోస్థానంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిలిచింది.

ఇదే దేశాల వారీగా చూస్తే మన ఎయిర్ ఫోర్స్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ఇక మనకన్నా ఎక్కువ సంఖ్యలో యుద్ధ విమానాలు, హెలిక్యాప్టర్లు ఉన్నా కూడా చైనా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఏడో స్థానంలో సరిపెట్టుకుంది. ఇక చైనా పీఎల్ఏ నేవీ ఎయిర్ ఫోర్స్ 15వ స్థానంలో నిలవడం గమనార్హం.

ఇక ఇండియన్ నేవీ ఏవియేషన్ 28వ స్థానంలో.. ఆర్మీ ఏవియేషన్ 36వ స్థానంలో నిలిచాయి. యుద్ధ విమానాల సంఖ్య ఇండియాలో కంటే చైనాలో 30శాతం ఎక్కువ. అయినా ర్యాంకింగ్స్ లో చైనా ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెనుక నిలిచింది.

ప్రపంచంలో చైనా, రష్యా సహా ఇతర దేశాలు భారీగా యుద్ధ విమానాలు, హెలిక్యాప్టర్లు, ఇతర సాంకేతికతను విచ్చలవిడిగా పోగేసి పెట్టుకుంటున్నా.. సాంకేతికతలను సమకూర్చుకోవడం.. సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వడం వంటివి చేపట్టడం లేదు. అందుకే అసలు సామర్థ్యంలో వెనుకబడిపోయినట్లు డబ్ల్యూడీఎంఎంఏ స్పష్టం చేసింది.