Begin typing your search above and press return to search.

హెచ్ 1బీ వీసా మోసం...తెలుగోడి అరెస్టు!

By:  Tupaki Desk   |   3 Nov 2018 11:13 AM GMT
హెచ్ 1బీ వీసా మోసం...తెలుగోడి అరెస్టు!
X
అమెరికాలో హెచ్ 1బీ వీసాల మోసం కేసులో ఓ తెలుగు వ్య‌క్తిపై అభియోగాల‌ను న‌మోదైన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. 46 ఏళ్ళ భార‌త సంత‌తి వ్య‌క్తి కిషోర్ కుమార్ కావూరును శుక్ర‌వారం నాడు యూఎస్ మేజిస్ట్రేట్ ముందుకు హాజ‌రుప‌రిచారు. ఆ త‌ర్వాత కిషోర్ ను బెయిల్ పై విడుద‌ల చేశారు. కిషోర్ పై 10 కౌంట్స్ వీసా మోసాల కేసులు న‌మోద‌య్యాయి. క‌న్స‌ల్టెన్సీల పేరుతో దొంగ వీసాలను పొందుతున్నాడన్న ఆరోప‌ణ‌లు రావ‌డంతో అధికారులు అత‌డిపై కేసు న‌మోదు చేశారు. ఈ కేసులో కిషోర్ దోషిగా తేలితే అత‌డికి ప్ర‌తి కౌంట్ కు 10 ఏళ్ల జైలు శిక్ష‌తోపాటు - రెండున్న‌ర ల‌క్ష‌ల డాల‌ర్ల జ‌రిమానా విధించే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది. ఓ వైపు హెచ్ 1బీ వీసాల పై ట్రంప్ ఉక్కుపాదం మోపేందుకు ప్ర‌య‌త్నిస్తోంటే...మ‌రోవైపు ఈ త‌ర‌హా వీసా మోసాలు బ‌య‌ట‌ప‌డ‌డం భార‌తీయుల‌ను క‌ల‌వ‌రపెడుతోంది.

2007 నుంచి అమెరికాలో 4 క‌న్స‌ల్టెన్సీ కంపెనీల‌ను కిషోర్ నిర్వ‌హిస్తున్నాడు. అప్ప‌టి నుంచి అత‌డు డిపార్ట్ మెంట్ ఆఫ్ లేబ‌ర్, డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ల‌కు త‌ప్పుడు ప‌త్రాలు స‌మ‌ర్పించి వీసాలు పొందుతున్నాడని విచార‌ణ‌తో తేలింది. బోగ‌స్ వ‌ర్క్ ప్రాజెక్ట్ ల‌తో విదేశీ ఉద్యోగుల పేరిట వీసాలు పొందుతున్నాడ‌ని తేలింది. 43 మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పేరిట కిషోర్ వీసాల కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌గా..వాటిలో ఒక్క ఉద్యోగం కూడా ఆయా సంస్థ‌ల్లో లేక‌పోవ‌డం విశేషం. దీంతోపాటు చాలామందికి కిషోర్ జీతాలు ఇవ్వ‌కుండానే మేనేజ్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో కిషోర్ కు శిక్ష ప‌డ‌తుంద‌ని అక్క‌డి భార‌త సంత‌తి వ్య‌క్తులు భావిస్తున్నారు.