Begin typing your search above and press return to search.

అమెరికా అధ్య‌క్ష బ‌రిలో భారత సంత‌తి వ్య‌క్తి.. ?

By:  Tupaki Desk   |   15 Jan 2023 9:30 AM GMT
అమెరికా అధ్య‌క్ష బ‌రిలో భారత సంత‌తి వ్య‌క్తి.. ?
X
అగ్ర‌రాజ్యం అమెరికాలో వ‌చ్చే ఏడాది అంటే.. 2024లో అధ్యక్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన చ‌ర్చ అమెరికాలో తీవ్రంగా జ‌రుగుతోంది. ప్ర‌స్తుత అధ్య‌క్ష‌డు జోబైడెన్ మ‌రోసారి పోటీకి దిగుతున్న‌ట్టు చెబుతున్నారు. అదేస‌మ‌యంలో మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పోటీకి రెడీ అంటున్నారు. అయితే.. వీరిద్ద‌రికీ కూడా.. ర‌హ‌స్య ప‌త్రాల‌కు సంబంధించిన కేసులు.. విచార‌ణ వెంటాడుతున్నాయి. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు బైడెన్ అయితే.. మ‌రింత తీవ్ర‌మైన చిక్కుల్లో ఉన్నారు.

తాజాగా ఆయ‌న ఇల్లు, ప్రైవేటు నివాసం. కార్యాల‌యంలో 2009-16 మ‌ధ్య కాలానికి చెందిన‌ర‌హ‌స్య ప‌త్రాలు దొరికాయి. దీంతో వీటి నిగ్గు తేల్చేందుకు విచార‌ణ‌కు అధికారిని కూడా నియ‌మించారు. మ‌రోవైపు ఇప్ప‌టికే 300 ర‌హ‌స్య ప‌త్రాల‌కు సంబంధించి మాజీ అధ్య‌క్షుడు ట్రంప్ కూడా విచార‌ణ‌ను ఎదుర్కొంటున్నారు. ఈ విచార‌ణ‌ల‌లో వారికి వ్య‌తిరేకంగా క‌నుక ఎలాంటి కేసైనా న‌మోదైతే.. వారు అధ్య‌క్ష పోటీకి అన‌ర్హులుగా మార‌నున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా.. అమెరికా అధ్య క్ష బ‌రిలో భార‌త సంత‌తి వ్య‌క్తి రో ఖ‌న్నా పేరు వినిపిస్తుండ‌డం.. సంచ‌ల‌నంగా మారింది.

ప్ర‌స్తుతం.. అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడుగా ఉన్న రోఖన్నా సెనెట్‌కు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న‌ అధ్యక్ష బరిలోనూ నిలిచేందుకు ఇది దోహ‌ద‌ప‌డుతుంది. ప్ర‌స్తుతం.. కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రో ఖన్నా.. ఇటీవల మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో సెనెట్‌కు పోటీ చేయడంపై ఆలోచిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఖ‌న్నా అధ్యక్ష పదవిపై దృష్టి పెట్టినట్లు డెమోక్రాట్లలో చ‌ర్చ జ‌రుగుతోంది.

వాస్త‌వానికి 2028లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఖ‌న్నా వ్యూహం సిద్ధం చేసుకున్నార‌ని.. కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. 2024లో ప‌రిస్థితులు ఆయ‌న‌కు అనుకూలంగా మారుతున్నాయి. విచార‌ణ‌లు ఎదుర్కొంటున్న ప్ర‌స్తుత అధ్య‌క్షుడు జో బైడెన్‌, మాజీ అధ్య‌క్షుడు ట్రంప్‌లు 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవ‌కాశం త‌క్కువగా ఉంది. ఈ క్ర‌మంలో రో ఖన్నానే ప్రధాన పోటీదారు అయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఖ‌న్నా చుట్టూ.. అధ్య‌క్ష ఎన్నిక‌ల వ్య‌వ‌హారం తిరుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

పంజాబీ హిందూ కుటుంబానికి చెందిన 46 ఏళ్ల రో ఖన్నా.. పెన్సుల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పంజాబ్‌ నుంచి అమెరికాకు వలసవెళ్లారు. తండ్రి కెమికల్‌ ఇంజినీర్‌. తల్లి స్కూల్‌ టీచర్‌గా పనిచేసేవారు. చికాగో యూనివర్శిటీలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పట్టా పొందిన ఖన్నా.. కొన్నాళ్లు స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో లెక్చరర్‌గా పనిచేశారు. 2014లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2016లో కాలిఫోర్నియా నుంచి ప్రతినిధుల సభలో అడుగుపెట్టారు.