Begin typing your search above and press return to search.

హెచ్1బీ వీసా ఉన్నవారి భార్యలకు ఊరట

By:  Tupaki Desk   |   30 May 2019 5:08 PM GMT
హెచ్1బీ వీసా ఉన్నవారి భార్యలకు ఊరట
X
హెచ్4 వీసాలను రద్దు చేయాలన్న అమెరికా నిర్ణయం భారతీయులు సహా లక్షలాది మంది విదేశీయులకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఈ విషయంలో ఇలాంటి వారికి ఓ శుభవార్త వినిపించింది అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారికి రక్షణగా కాలిఫోర్నియాకు చెందిన సెనెటర్లు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌ లో బిల్లు ప్రవేశపెట్టారు. దీంతో హెచ్ 4 వీసాదారులకు కాస్త ఊరట లభించినట్లైంది. అమెరికా చట్టసభ ప్రతినిధులైన అన్నా జి ఎషో - జో లాఫ్‌ గ్రెన్‌ లు వీసాదారుల రక్షణ కోసం హెచ్4 ఎంప్లాయిమెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును ప్రవేశపెట్టారు.

హెచ్4 వీసాలు అమెరికాలో హెచ్ 1బీ వీసాలపై పనిచేస్తున్న వ్యక్తుల జీవిత భాగస్వాములు, వారి 21ఏళ్ల లోపు వయసున్న పిల్లలకు హెచ్ 4 వీసా ఇస్తారు. ఈ వీసా ద్వారా వారు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు అనుమతి లభిస్తుంది. 2015లో అప్పటి ఒబామా సర్కారు హెచ్ 4 వీసాలు ప్రవేశపెట్టింది. అమెరికాలో సాంకేతిక నిపుణుల కొరత ఉండటంతో ఆ లోటు భర్తీ చేసుకునేందుకు ఒబామా ప్రభుత్వం హెచ్ 4వీసాలను తెరపైకి తెచ్చింది. దీంతో పలు సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో హెచ్ 1బీ వీసాదారుల భార్య లేదా భర్తలు కూడా ఉద్యోగం చేసే అవకాశం దొరికింది. వీసా రద్దుకు ట్రంప్ మొగ్గు హెచ్ 4వీసాల వల్ల చైనా - భారత్ తదితర దేశాలకు చెందిన వారు లాభపడుతున్నారని - స్థానికులు ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారన్న వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2017లో అధికారం చేపట్టిన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒబామా సర్కారు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గతేడాది ఫిబ్రవరిలో హెచ్ 4 వీసా రద్దు ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. 2018 అక్టోబర్‌ లో డిపార్ట్‌ మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ కూడా ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పడంతో హెచ్ 4 వీసాదారుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది.

లక్షల మందిపై ప్రభావం ఒబామా ప్రవేశపెట్టిన హెచ్ 4 వీసాలతో భారత్‌ కు చెందిన మహిళలు ఎక్కువగా లబ్ది పొందారు. ఇప్పటి వరకు దాదాపు లక్ష మంది వర్క్ పర్మిట్ పొంది ఉద్యోగాలు చేస్తున్నారు. ట్రంప్ నిర్ణయంతో వీరందరి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలో సెనెటర్లు వారందరికీ భరోసా ఇస్తూ చట్టసభలో బిల్లు ప్రవేశపెట్టారు. మరి దీనిపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి.