Begin typing your search above and press return to search.

పాక్ బంకర్లపై ఇండియా మెరుపుదాడి

By:  Tupaki Desk   |   24 April 2018 10:43 AM GMT
పాక్ బంకర్లపై ఇండియా మెరుపుదాడి
X

ఇండియ‌న్ ఆర్మీ మ‌రోమారు త‌న స‌త్తా చాటింది. ప‌దే పదే కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్తాన్‌కు బుద్ది చెప్పింది. మన జవాన్లు జరిపిన కాల్పుల్లో పాక్ లోని మూడు బంకర్ల ధ్వంసం అయ్యాయి. భారత సైన్యం జరిపిన మెరుపుదాడిలో ఐదుగురు పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్ లోని పూంచ్ - రాజౌరీ జిల్లాల్లో జరిగింది. కొంత కాలంగా భారత్ పై కాల్పులతో దాడికి పాల్పతున్న పాక్ పై ఇండియన్ ఆర్మీ పత్రీకారం తీర్చుకుంది. ఈ ఏడాది జనవరి 5 నుంచి మార్చి 5 వరకు 351 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి… భార‌త్‌పై పాక్ దాడులకు పాల్పడింది .

ఇదిలాఉండ‌గా... పాక్ బుద్ధిని బ‌య‌ట‌పెట్టే మ‌రో ఘ‌ట‌న చోటుచేసుకుంది. వాఘా బార్డర్‌లో పాక్‌ క్రికెటర్‌ ఓవరాక్షన్‌ చేశాడు. భారత సైన్యం ముందు హంగామా సృష్టించాడు. రెచ్చగొట్టే ధోరణిలో ప్రవర్తిస్తూ కుప్పిగంతులు వేశాడు. వాఘా బోర్డర్‌లో ప్రతిరోజూ జరిగే బీటింగ్‌ రీట్రీట్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా.. గ్యాలరీలో కూర్చున్న పాక్‌ క్రికెటర్‌ హసన్‌ అలీ హఠాత్తుగా గేట్ల వైపు పరుగుతీశాడు. అక్కడ నిలబడి భారత సైన్యాన్ని, గ్యాలరీలో ఉన్న భారతీయుల్ని రెచ్చగొట్టేలా ప్రవర్తించాడు. తన చేష్టలతో పిచ్చి వేషాలు వేస్తూ రెచ్చిపోయాడు. ఇంత జరుగుతున్నా పాక్‌ అధికారులెవరూ అతన్ని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ వ్యవహారాన్ని భారత సైన్యం సీరియస్‌ గా తీసుకుంది. హసన్‌ తో క్షమాపణలు చెప్పించి, ఘటనపై విచారణ జరపాలని డిమాండ్‌ చేసింది. అయితే పాక్‌ ఆర్మీ మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు.