Begin typing your search above and press return to search.

పరేడ్ లో అందరి మనసుల్ని దోచుకున్నాయ్

By:  Tupaki Desk   |   27 Jan 2016 4:44 AM GMT
పరేడ్ లో అందరి మనసుల్ని దోచుకున్నాయ్
X
రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్ పథ్ లో భారీ కవాతు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కవాతులో పాల్గొన్న వారందరితో పాటు.. టీవీలో ఈ కార్యక్రమాన్ని ఫాలో అయిన వారందరి మనసును దోచుకున్న కవాతు ఒకటుంది. దాదాపు 26ఏళ్ల తర్వాత పరేడ్ లో పాల్గొన్న సైనిక జాగిలాలు తీరు స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. మొత్తం 24 లాబ్రాడర్లు.. మరో 12 జర్మన్ షెపర్డ్ లు కవాతులో పాల్గొని చూపురుల్ని విపరీతంగా ఆకర్షించాయి.

మొత్తం 1200 జాగిలాల నుంచి 36 శునకాల్ని ఎంపిక చేసి.. వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీటికి ముదురు ఎరుపు.. పసిడి వర్ణాలతో కూడిన డ్రెస్ వేసి రాజసం ఉట్టి పడేలా తయారుచేశారు. వీటికి తగ్గట్లే ఇవి కవాతులో పాల్గొని.. క్రమశిక్షణతో వ్యవహరించటం.. కవాతు సందర్భంగా తమను ముందుండి నడిపించిన అధికారి ఏం చేశారో దాన్నే పక్కాగా ఫాలో కావటం అందరి దృష్టిని ఆకర్షించింది. మరి ముఖ్యంగా.. కవాతులో భాగంగా ప్రధాన వేదిక వద్దకు వచ్చిన వెంటనే.. ముఖాన్ని వేదిక వైపు చూసి నడిచే అధికారులకు తగ్గట్లే పరేడ్ లోపాల్గొన్న జాగిలాలు సైతం అంతే క్రమశిక్షణతో వ్యవహరించటం అబ్బురంగా మారింది.

ప్రస్తుతం సైనిక అవసరాల కోసం మొత్తం నాలుగు జాతుల జాగిలాలను సైన్యంలో వినియోగిస్తున్నారు. వీటిల్లో లాబ్రాడర్.. జర్మన్ షెపర్డ్.. బెల్జియం మిల్లినోయిస్.. గ్రేట్ మౌంటన్ స్విస్ జాతులు ఉన్నాయి. వీటిల్లో మొదటి రెండు జాతులకు చెందిన జాగిలాలు తాజా పరేడ్ లో పాల్గొన్నాయి.